యాసంగి వడ్లలో సర్కార్ కొన్నది 47 లక్షల టన్నులే

యాసంగి వడ్లలో సర్కార్ కొన్నది 47 లక్షల టన్నులే
  • కిందటేడు ఈ టైంకు 84.51లక్షల టన్నుల సేకరణ
  • నిరుటి కంటే 37 లక్షల టన్నులు తక్కువ
  • తగ్గించిన టార్గెట్‌‌ కూడా అందుకోలేదు
  • ఇప్పుడు 1796 సెంటర్లలోనే సేకరణ

హైదరాబాద్‌‌, వెలుగు: నిరుటితో పోలిస్తే యాసంగి ధాన్యం కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. కిందటేడు ఇదే రోజున 84.51 లక్షల టన్నుల ధాన్యం కొంటే ఈసారి 47.31లక్షల టన్నులు మాత్రమే కొన్నరు. సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభమై 56 రోజులు అయినా టార్గెట్ మేరకు కొనలేక పోయారు. మార్చి నెలాఖరు నుంచే వరి కోతలు షురూ అయినా కొనకుండా ఏప్రిల్‌‌ 15 వరకు సెంటర్లు షురూ కాలేదు. యాసంగి వరి సాగుపై సర్కారు ఆంక్షలు, సెంటర్లు పెట్టడంలో ఆలస్యంతో ఈయేడు వడ్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. నిరుడుతో పోలీస్తే 20కి పైగా జిల్లాల్లో కొనుగోళ్లు తగ్గిపోయాయి.

రైతులకు రూ.500 కోట్ల నష్టం
సేకరించిన 47.31లక్షల టన్నుల్లో 46.93 లక్షల టన్నులు మిల్లులకు తరలించారు. కొనుగోళ్ల జాప్యంతో సెంటర్లను నమ్ముకోలేక రైతులు బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకున్నరు. దీంతో ఈయేడు యాసంగిలో పెట్టుకున్న 72.89 లక్షల టన్నుల టార్గెట్‌‌ను 56.14 లక్షల టన్నులకు కుదించుకున్నారు. నిరుడు ఇదే టైమ్‌‌కు కొన్న వడ్లలో 44శాతం తక్కువ కొనడం గమనార్హం. ఈయేడు ఆలస్యం చేయడం వల్లే మరో 15లక్షల టన్నులకు పైగా వడ్లు రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నరు. ఫలితంగా రైతులు రూ.500కోట్లకు పైగా నష్టపోయారు.

4796 సెంటర్లు మూసేసిన్రు
యాసంగిలో 6823 సెంటర్లు ఏర్పాటు చేయాలని టార్గెట్‌‌ పెట్టుకొని 6584 సెంటర్లు తెరిచారు. ఇందులో  4796 సెంటర్లను మూసేశారు. ప్రస్తుతం1796 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. సర్కారు వడ్లు కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగానే రైతులు కష్టాలు తప్పలేదు. ముందస్థు ఏర్పాట్లు చేస్తే అవస్థలు ఉండేవి కాదని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అంటున్నయి. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో సన్నధాన్యం కొనట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు.

వడ్ల పైసలు 4 వేల కోట్లు అందలే
రాష్ట్ర వ్యాప్తంగా 8.49లక్షల మంది రైతుల నుంచి రూ.9261.35 కోట్ల విలువైన వడ్లు సర్కార్ కొనుగోలు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ.5233.18కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ట్రక్‌‌ షీట్ల జాప్యం, నగదు బదిలీలో నిర్లక్ష్యం కారణంగా వడ్ల పైసలు ఇంకా రూ.4028.16కోట్లు రైతులకు అందలేదు. అమ్ముకున్న వడ్ల పైసల్లో ఇంకా 43.5శాతం పైసలు రైతులకు చేరలేదు.