మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ .. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్

మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ .. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం

హైదరాబాద్: రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు..గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణశాఖ అధికారులు.  ఆఫీసర్లు. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , మంచిర్యాల, నిర్మల్ , భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్  జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా ఇవే జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పారు. వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద 

పది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దగ్గర మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు ఇవాళ వరద పోటు తగ్గడంతో గేట్లు మూసేశారు. వనదుర్గ ప్రాజెక్ట్ పొంగి పొర్లుతోంది. మంజీరా నది అమ్మవారి గర్భగుడిని తాకుతూ ప్రవహిస్తోంది. ఆలయ పరిసర ప్రాంతంలోని షాపులన్నీ నీట మునిగాయి. దీంతో ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. 
గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల వద్ద జల కళ

రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరిధిలోని చిన్నా, పెద్ద ప్రాజెక్టుల దగ్గర జలకళ కనిపిస్తోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 82వేల 740 క్యూసెక్కుల వరద వస్తుండగా..18 గేట్లను ఎత్తి 74 వేల 952 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. 56వేల 5వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 8 గేట్ల ద్వారా 55వేల 5వందల క్యూసెక్కుల నీటిని  వదులుతున్నారు. 
కడెం ప్రాజెక్టులోకి 12వేల 7వందల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. కాళేశ్వరం దగ్గర గోదావరి 10.89 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మేడిగడ్డలోకి 5.15 లక్షల క్యూసెక్కులు, అన్నారంలోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. అంతే నీటిని దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం దగ్గర 40.6 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. 
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 96 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్ లోయర్ మానేరు 20 గేట్లు ఎత్తడంతో నీరు పరవళ్లు తొక్కుతోంది. భద్రాద్రి జిల్లా తాలిపేరు ప్రాజెక్టు 25గేట్లు పూర్తిగా ఎత్తి 28వేల 932 క్యూసెక్కుల నీటిని వదలిపెడుతున్నారు.
కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఎగువన జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి వరద ఉధృతి తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లన్నీ మూసేశారు. జూరాల వైపు నుండే కాదు.. సుంకేశుల నుంచి వస్తున్న తుంగభద్ర వరద కూడా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లన్నీ మూసేసినా.. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ.. 62వేల క్యూసెక్కుల నీరు దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. 

పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరగటంతో..విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు అధికారులు. మూడు యూనిట్ల ద్వారా 75మెగావాట్ల పవర్ జనరేషన్ చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 17వేల 4వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా..ఔట్ ఫ్లో 7వేల 9వందల క్యూసెక్కులుగా ఉంది.