రాష్ట్రంలో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

రాష్ట్రంలో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

రాష్ట్రంలో  మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 15వ తేదీ నుంచి జులై 16వ తేదీ ఆదివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వానలు పడతాయని పేర్కొంది. అలాగే  నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోనూ  వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. జులై 16వ తేదీ, 17వ తేదీల్లో రాష్ట్రంలో మరికొన్ని  ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

జులై 18వ తేదీ మంగళవారం  నుంచి జులై 19వ తేదీ బుధవారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. జులై 19వ తేదీ నుంచి జులై 20వ తేదీ వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు  ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

జులై 14వ తేదీ ఉత్తర కోస్తాంధ్ర  మీద ఉన్న ఆవర్తనం జులై 15వ తేదీ  బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జులై 15  వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్‌ పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు మరో ఆవర్తనం ఏర్పడి  ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఈ ఆవర్తనం రాబోయే రెండు మూడు రోజుల్లో  పశ్చిమ వాయువ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్‌టక్‌, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్  మీదగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. మరొక ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో సుమారుగా జులై 18న ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. జులై 15వ తేదీ దిగివ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని..వీటి ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా  మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో జులై 15 నుంచి 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.