
హైదరాబాద్, వెలుగు: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టడంలో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచారు. దేశంలోనే అత్యధికంగా లక్ష 20 ఫోన్లను గుర్తించారు. ఈ మేరకు సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెలీ కమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్)టెక్నాలజీని 780 పోలీస్ స్టేషన్లలో 2023 ఏప్రిల్ 20 నుంచి వినియోగిస్తున్నట్టు తెలిపారు.
సీఈఐఆర్ ద్వారా ఈ నెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కలిపి 1,00,020 మొబైల్ ఫోన్లను గుర్తించినట్టు వెల్లడించారు. జాతీయ స్థాయిలో 98,189 మొబైల్ ఫోన్ల రికవరీతో కర్నాటక రెండో స్థానంలో నిలిచినట్టు చారు సిన్హా పేర్కొన్నారు.