V6 News

తెలంగాణ గజగజ..20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు

తెలంగాణ గజగజ..20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు
  • 20 జిల్లాల్లో సింగిల్​ డిజిట్​ టెంపరేచర్లు
  • భారీగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
  • నాలుగు జిల్లాల్లో 6 డిగ్రీల మేర నమోదు
  • అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 6.1 డిగ్రీలు రికార్డ్​
  • ఆదిలాబాద్​, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
  • మరో మూడు నాలుగు రోజులు చలి మరింత తీవ్రమవుతుందని అధికారుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: చలితో రాష్ట్రం గజ గజ వణుకుతున్నది. ఫస్ట్​ వేవ్​తో పోలిస్తే.. సెకండ్​ వేవ్​లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సాయంత్రం 6 గంటల నుంచే మొదలవుతున్న చలి.. మిట్టమధ్యాహ్నం 12 గంటల వరకూ వదలడం లేదు. సోమవారం రాత్రి 20 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్​ డిజిట్​లో నమోదయ్యాయంటే చలి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 12.6 డిగ్రీల మధ్యే నమోదవడం గమనార్హం. నాలుగు జిల్లాల్లో 6 డిగ్రీలు, 2 జిల్లాల్లో 7 నుంచి 7.9, ఏడు జిల్లాల్లో 8 నుంచి 8.9, మరో ఏడు జిల్లాల్లో 9 నుంచి 9.9 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఐదు జిల్లాల్లో 10 డిగ్రీలు, ఇంకో 8 జిల్లాల్లో 11 నుంచి 12.6 డిగ్రీల మధ్య నైట్​ టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా గిన్నెదారిలో 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్​లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప రికార్డ్​ నైట్​ టెంపరేచర్​ ఇదే. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాంతాల్లో ఆటోమేటిక్​ వెదర్​ స్టేషన్స్​ ఉండగా.. అందులో 210కిపైగా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్​ డిజిట్​లోనే నమోదయ్యాయి. 

వణుకుతున్న ఏజెన్సీ,  అటవీ ప్రాంతాలు​..

రాష్ట్రంలో అటవీ ప్రాంతం ఎక్కువున్న ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్​ జిల్లా అర్లిటీలో 6.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్​ జిల్లా మోమిన్​పేటలో 6.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్​ రికార్డయింది. రంగారెడ్డి జిల్లా మంగళపల్లి (ఇబ్రహీంపట్నం)లో 7.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 7.9, మెదక్​ జిల్లా ఎల్దుర్తిలో 8.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.2, నిర్మల్​ జిల్లా పెంబిలో 8.3, నిజామాబాద్​ జిల్లా కోటగిరిలో 8.4, మహబూబ్​నగర్​ జిల్లా సల్కార్​పేటలో 8.6, రాజన్నసిరిసిల్ల జిల్లా మానాలలో 8.7, నారాయణపేట జిల్లా కోస్గిలో 8.9, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 9.1, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 9.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 9.5, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 9.5, నాగర్​కర్నూల్​ జిల్లా తోటపల్లిలో 9.6, కరీంనగర్​ జిల్లా వెదురుగట్టులో 9.8, ములుగు జిల్లా మేడారంలో 9.9 డిగ్రీల మేర నైట్​ టెంపరేచర్లు రికార్డయ్యాయి. 

హైదరాబాద్ లో హెచ్ సీ యూ వద్ద 8 డిగ్రీలు..

జీహెచ్​ఎంసీ పరిధిలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్ సెంట్రల్​యూనివర్సిటీ వద్ద అత్యల్పంగా 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాజేంద్రనగర్​లో 8.5, బీహెచ్​ఈఎల్​ ఫ్యాక్టరీ వద్ద 9.4 డిగ్రీల మేర నైట్​టెంపరేచర్లు నమోదయ్యాయి. గచ్చిబౌలిలో 10.8, శివరాంపల్లిలో 10.9 చొప్పున నైట్​ టెంపరేచర్లు నమోదయ్యాయి. అయితే, చలి తీవ్రత రాబోయే మూడు రోజులు మరింత పెరిగే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే ముప్పు ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ఐదు డిగ్రీలకన్నా తక్కువకు పడిపోయే ముప్పు ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్​ సిటీలోనూ 6 డిగ్రీల వరకు టెంపరేచర్లు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. చలి ప్రభావం పెరుగుతుండడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ సూచిస్తున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, ఆస్తమా, గుండె జబ్బులు, ఉబ్బసం సంబంధిత జబ్బులున్న వాళ్లు బయటకు వెళ్లకుండా ఉండాలని, చలి నుంచి కాపాడుకునేలా వెచ్చని దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు.