విద్యార్థులకు తప్పని తిప్పలు

విద్యార్థులకు తప్పని తిప్పలు
  • హాస్టల్ బిల్డింగ్ లేక అవస్థలు పడుతున్న కౌడిపల్లి గురుకుల విద్యార్థులు 
  • శిథిలావస్థలో వసతి గృహం.. ఊరుస్తూ పెచ్చులూడుతున్న పైకప్పు
  • ప్రైవేట్ బిల్డింగ్ లోకి స్టూడెంట్స్ తరలింపు
  • అక్కడా కనీస సౌకర్యాలు కరువు.. విద్యార్థులకు తప్పని తిప్పలు

మెదక్​ జిల్లా కౌడిపల్లిలోని ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ చాలా ఏండ్ల కింద కట్టినది. దీంతో పైకప్పు పెచ్చులూడి వర్షానికి గదులన్నీ ఉరుస్తున్నాయి. కూలే ప్రమాదం ఉందని స్టూడెంట్స్​ను ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బిల్డింగ్​లోకి తరలించారు. కానీ అక్కడ కూడా కనీస వసతులు కరువయ్యాయి. బిల్డింగ్​కు రేలింగ్, కిటీకీలు, తలుపులు లేక ముసురుకు పిల్లలు వణుకుతున్నారు. కనీసం కరెంట్​ సౌకర్యం లేదు. బాత్​రూములు లేవు. ఈ పరిస్థితుల్లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

మెదక్ (కౌడిపల్లి), వెలుగు :  కౌడిపల్లిలో 2017లో మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ అయ్యింది. 5 నుంచి 10వ తరగతి వరకు 260 మంది స్టూడెంట్స్ ఉండగా, సరిపడా గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ చాలా ఏండ్ల కింద నిర్మించింది కావడంతో శిథిలావస్థకు చేరింది.  పైకప్పు పెచ్చులూడి పడుతూ ప్రమాదకరంగా మారింది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో హాస్టల్ బిల్డింగ్ గదుల గోడలు తడిసిపోవడం, పైకప్పు పెచ్చులూడి పడుతూ నీరు ఉరుస్తుండటంతో బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం నెలకొంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ సరిగా లేకపోవడంతో కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం పొంచి ఉందని చెప్పి సరఫరా నిలిపి వేశారు. దీంతో రెండు రోజులుగా అంధకారం నెలకొనడం, పైనుంచి నీరు కురుస్తుండటంతో స్టూడెంట్స్ ఎప్పుడేమి జరుగుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ  స్థానికంగా నిర్మాణంలో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధికి  చెందిన బిల్డింగ్ లోకి తరలించారు. అయితే ఆ బిల్డింగ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. స్టూడెంట్స్​కు రెండో అంతస్తులో వసతి కల్పించారు. కానీ ఆ ఫ్లోర్ లో గదులకు తలుపులు, కిటికీలు, బాత్ రూమ్​లు, టాయిలెట్, నీటి  సౌకర్యం లేకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. ఆదివారం రాత్రి ముసురు కారణంగా చలికి వణుకుతూ ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కొంత మంది తల్లిదండ్రులు  సోమవారం అక్కడికి వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.

భయంతో నిద్ర పట్టట్లేదు 


మా హాస్టల్ బిల్డింగ్ వర్షానికి పెచ్చులూడుతుండటం, కరెంట్ లేకపోవడంతో ఏమవుతుందో అని భయంతో రాత్రివేళ పడుకోకుండా మెలకువగా ఉన్నాం. ఇప్పుడు మార్చిన బిల్డింగ్​లో కూడా రేయిలింగ్, బాత్రూమ్స్, కరెంట్, తలుపులు లేక ఇబ్బంది పడుతున్నాం. రాత్రి వణుకుతూ పడుకోవాల్సి వచ్చింది. 
- వివేక్, స్టూడెంట్, టెన్త్ క్లాస్ 

ఇబ్బంది అవుతోంది.. 
మూడు రోజుల నుంచి వర్షం కురవడంతో తరగతి గదులలో వర్షపు నీరు చేరి ఇబ్బంది అవుతోంది. గదుల పై కప్పు పెచ్చులూడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ వస్తుందేమోనని  తరగతి గదులలో పవర్ ఆఫ్ చేశాం. విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి స్టూడెంట్స్​ కోసం ప్రైవేట్ బిల్డింగ్​లో వసతి కల్పించారు. 
- శ్రీలత, ప్రిన్సిపాల్