బడ్జెట్: మద్యం.. భూములే ఆధారం! పన్నుల రూపంలో రూ. 1.81 లక్షల కోట్లు అంచనా

బడ్జెట్: మద్యం.. భూములే ఆధారం! పన్నుల రూపంలో రూ. 1.81 లక్షల కోట్లు అంచనా
  •  కేంద్రం గ్రాంట్లపై భారీ ఆశలు
  • గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 24,166 కోట్లు
  •  జీఎస్టీ టార్గెట్ రూ.61,564  కోట్లు
  • లిక్కర్​ సేల్స్​తో రూ. 46,941 కోట్లు 
  • నాన్​ టాక్స్​ ఆదాయం రూ.35,730 కోట్లు 
  • భూముల అమ్మకాలు, హిల్ట్​పాలసీతో రూ. 23 వేల కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్ర సొంత పన్నుల రాబడిపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా పన్ను రాబడిలో పెద్ద ఎత్తున వృద్ధిని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచే పన్ను రాబడి 2026–27లో రూ.1,81,367 కోట్లు ఉంటుందని భావిస్తోంది. ఇందులో జీఎస్టీ వాటా అత్యధికంగా ఉండటం గమనార్హం. సెంట్రల్​జీఎస్టీతో రూ.9,074 కోట్లు వస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర వస్తు సేవల పన్ను గా(స్టేట్​ జీఎస్టీ) మరో రూ. 52,490 కోట్లు వస్తాయని లెక్కగట్టారు. 

అంటే మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.61,564 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. ఆదాయపు పన్నుతో పాటు ఇతర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కార్పొరేషన్ పన్ను ద్వారా రూ. 9740 కోట్లు వస్తుందని అంచనా వేశారు. మన దేశంలో నమోదైన కంపెనీలు, సంస్థలు గడించే లాభాలపై కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేషన్ పన్నులో రాష్ట్రాల వాటా కూడా ఉంటుంది. పారిశ్రామికాభివృద్ధి, కొత్త స్టార్టప్‌‌‌‌ల రాక వల్ల ఈ పన్ను వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఈ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

పెట్రోల్​, డీజిల్​ సేల్స్​ టాక్స్​ రూ.18649 కోట్లు 

రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలతో రికార్డు స్థాయిలో మొత్తం రూ. 46,941 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. బడ్జెట్ అంచనాల ప్రకారం ఎక్సైజ్ శాఖ నేరుగా వసూలు చేసే పన్నులు, మద్యం అమ్మకాలపై విధించే వ్యాట్ కలిపి ఈ భారీ మొత్తం రానుంది. రాష్ట్ర మద్యం అమ్మకాల కింద రూ. 27,668.48 కోట్లు వస్తాయని లెక్కగట్టారు. విక్రయాల్లో 'వ్యాట్ బై ఎక్సైజ్' రూపంలో మరో రూ. 19,273.07 కోట్లు ఖజానాకు చేరనున్నాయి.  ఏటా మద్యం వినియోగం పెరుగుతున్నందున  గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు ఈ భారీ ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరుగా నిలుస్తోంది. ఎక్సైజ్ శాఖకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా జరిమానాలు, క్రీడా పాలసీ సర్​చార్జీ రూపంలోనూ అదనపు ఇన్​కం రానుంది.  

మద్యం షాపుల యజమానులు చెల్లించే యూజర్ చార్జీలు, లైసెన్స్ ఫీజుల ద్వారా మరో రూ. 3,500 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. సేల్స్​ టాక్స్ లో​ పెట్రోల్​, డీజిల్​ వంటి వాటిపై వ్యాట్ తోనే రూ. 18,649 కోట్లు వస్తుందని అంచనా వేశారు. వీటితో పాటు పాత సేల్స్ టాక్స్ చట్టం కింద వచ్చే వసూళ్లు రూ. 27.32 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. అంతర్ రాష్ట్ర వ్యాపార లావాదేవీలపై విధించే సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్​టీ) ద్వారా రూ. 175.11 కోట్ల ఆదాయం రానుంది. టర్నోవర్ టాక్స్ రూపంలో ప్రభుత్వానికి రూ. 54.65 కోట్ల ఆదాయం సమకూరనుంది. 

  • ఈసారైనా లక్ష్యం చేరేనా?

పన్నేతర రాబడి విషయానికి వస్తే రూ. 35,730 కోట్లు వస్తుందని  ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భూముల విక్రయమే అతిపెద్ద వనరుగా మారబోతోంది. ప్రభుత్వ భూములు, ఆస్తుల విక్రయాలు, రెగ్యులరైజేషన్​ వంటి స్కీములతో రూ. 23వేల కోట్ల భారీ ఆదాయాన్ని ఆశిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలువైన భూములకు ఉన్న విపరీతమైన డిమాండ్‌‌‌‌ను నగదుగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బహిరంగ ప్లాట్లు, ఇండ్ల విక్రయాల ద్వారా రూ.3,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. రాజీవ్ స్వగృహ లాంటి గృహ నిర్మాణ సంస్థల పరిధిలో మిగిలిపోయిన ఫ్లాట్లను అమ్మాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాత నివాస సముదాయాలు ప్రభుత్వ క్వార్టర్లను ఆధునీకరించి విక్రయించడం ద్వారా ఈ ఆదాయాన్ని రాబట్టే అవకాశం ఉంది. 

సాధారణ భూములు ఆస్తుల విక్రయాల పద్దు కింద ప్రభుత్వం రూ. 6,500 కోట్ల రాబడిని ఆశిస్తున్నది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఆస్తులను గుర్తించి వాటిని వ్యాపార అవసరాలకు విక్రయించాలని నిర్ణయించారు. అదనపు వనరుల సమీకరణలో భాగంగా భూముల ద్వారా రూ. 13,000 కోట్ల భారీ మొత్తాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూములకు సంబంధించి పెండింగ్‌‌‌‌లో ఉన్న 58,59 జీవోలు కింద క్రమబద్ధీకరణతో నిధులు రానున్నాయి. ఎల్ఆర్ఎస్ వంటి పథకాల ద్వారా వచ్చే దరఖాస్తుల ఫీజులు కూడా ఈ ఆదాయంలో ఉన్నాయి. హిల్ట్​ పాలసీలో భాగంగా భూ వినియోగ మార్పిడి రుసుముల ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం 
భావిస్తోంది. 

  • మైనింగ్​ టార్గెట్​ రూ.7,600 కోట్లు

మైనింగ్, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం అత్యంత కీలకంగా మారింది. గ్రానైట్, సున్నపురాయి, కంకర, ఇసుక మైనింగ్ ద్వారా రూ. 7,600 కోట్లు వస్తుందని భావిస్తున్నారు. మైనింగ్ రంగంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి రాయల్టీలను వసూలు చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వడ్డీ వసూళ్ల ద్వారా రూ. 187 కోట్లు, డివిడెండ్లు, లాభాల ద్వారా రూ. 185 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వివిధ ప్రభుత్వ సేవలు అంటే పోలీస్, జైళ్లు, పబ్లిక్ వర్క్స్ ద్వారా వచ్చే రాబడి కూడా ప్రధానంగా ఉన్నది. విద్యా, క్రీడలు వంటి సోషల్​ సర్వీసెస్​ లో రూ. 1,220 కోట్లు వస్తాయని లెక్కగట్టారు. 

కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, రాష్ట్రం తీసుకునే అప్పుల వివరాలను కూడా ఈ బడ్జెట్‌‌‌‌లో స్పష్టంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రూ. 24,166 కోట్లు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరోవైపు రాష్ట్ర అవసరాల కోసం బహిరంగ మార్కెట్ నుంచి తీసుకునే అప్పుల ద్వారా రూ. 74,483 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు రూ. 5,500 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు. దీంతో మొత్తం అప్పుల మొత్తం రూ.79,983 కోట్లకు చేరుకుంది.