V6 News

Telangana Global Summit : తొలిరోజు పెట్టుబడులు రూ.2.43 లక్షల కోట్లు..35 కు పైగా ఒప్పందాలు

Telangana Global Summit : తొలిరోజు పెట్టుబడులు రూ.2.43 లక్షల కోట్లు..35 కు పైగా ఒప్పందాలు
  • ‘తెలంగాణ రైజింగ్’  గ్లోబల్​ సమిట్​లో 35కు పైగా ఒప్పందాలు
  • రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలివచ్చిన దేశ, విదేశీ కంపెనీలు
  • డీప్‌ టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్​మెంట్లు
  • సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్​బాబు సమక్షంలో సంతకాలు
  • 41 వేల కోట్ల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం
  • 75 వేల కోట్లతో ఫ్యూచర్​ సిటీలో బ్రుక్‌ఫీల్డ్  యాక్సిస్ వెంచర్స్ కూటమి డీప్​ టెక్​ హబ్​  
  • వెయ్యి కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్​ హబ్​
  • 8 వేల కోట్లతో మేఘా సంస్థ సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు
  • ఆసియాలోనే అతిపెద్ద ‘వంతార’కు ముకేశ్​ అంబానీ ఓకే
  • ​రూ.10 వేల కోట్లతో సల్మాన్​ఖాన్​ టౌన్‌షిప్, ఫిల్మ్​ అండ్​ టెలివిజన్ స్టూడియో

హైదరాబాద్, వెలుగు:  ‘తెలంగాణ రైజింగ్–2047’ గ్లోబల్ సమిట్​లో తొలిరోజే (డిసెంబర్ 08) రాష్ట్రానికి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఫ్యూచర్​ సిటీ వేదికగా సోమవారం రెండు రోజుల గ్లోబల్​ సమిట్​ ప్రారంభమైంది. మొదటి రోజు సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వివిధ కంపెనీలు  35 ఎంవోయూలపై సంతకాలు చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో.. డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అంగీకరించాయి.   

ప్రత్యేకంగా రెన్యూవబుల్​ ఎనర్జీ, బయోటెక్, సినిమా నిర్మాణం, మీడియా, విద్య, టెక్నాలజీ వంటి సెక్టార్లలో  ఆసక్తి చూపించాయి. ఈ పెట్టుబడులతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు దక్కుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇది ‘విజన్ –2047’ కోసం శుభ పరిణామమని పేర్కొంది. 

‘‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వంపై ఆ కంపెనీల విశ్వాసానికి నిదర్శనం ఈ పెట్టుబడులు. ఇక్కడ పెట్టే  ప్రతి రూపాయికి భరోసా ఉంటుంది. ఇక్కడి యువతకు నాణ్యమైన ఉపాధి అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ సిటీ నుంచి టెక్స్​ టైల్​ యూనిట్​ వరకు అన్ని రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు,  వైవిధ్యమైన పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ముందుకు వచ్చాయని.. ఇది తెలంగాణ సుస్థిర పరిశ్రమల విధానాన్ని ప్రపంచానికి చాటిచెపుతున్నదని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు.  ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ 2047 దిశలో బలమైన పునాదులు వేస్తాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.  

 

తొలిరోజు ప్రధాన పెట్టుబడులు..!

  • స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్థానిక వెంచర్ల కోసంరూ. వెయ్యి కోట్ల సీడ్ క్యాపిటల్  సమకూర్చింది. 
  • వరల్డ్ ట్రేడ్ సెంటర్..   ఇన్నోవేషన్​ హబ్​ ఏర్పాటుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. 
  • ఈవ్​రెన్​ యాక్సిస్​ ఎనర్జీ సంస్థ రూ.31500 కోట్ల తో సోలార్ పవర్​, విండ్ పవర్​ మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 
  • మేఘా ఇంజనీరింగ్ గ్రూప్ రూ.8 వేల కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.
  • ఏరోస్పేస్​ డిఫెన్స్​ రంగాల్లో ఎమ్మార్వోతో పాటు కార్గో విస్తరణకు జీఎంఆర్​ గ్రూప్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది.
  • డిఫెస్స్​, ఏవియానిక్స్​ తయారీకి అపోల్​ మైక్రో సిస్ట మ్​ లిమిటెడ్​ రూ.1,500 కోట్లు పెట్టుబడులకు సిద్ధపడింది. 
  • సోలార్​ ఏరోస్పేస్​, డిఫెన్స్​ రంగంలో మిస్సైల్​ భాగాలు, ఏరో ఇంజన్​ స్ట్రక్చర్​కు రూ. 1,500 కోట్లు, ఎంపీఎల్​ లాజిస్టిక్స్​ కంపెనీ రూ.700 కోట్లు,  టీవీఎస్​ ఐఎల్​పీ రూ.200 కోట్లు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. 
  • రెన్యూసిస్​, మిడ్ వెస్ట్, అక్షత్​ గ్రీన్​ టెక్​  ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్ విస్తరణకు రూ. 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. 
  • డిస్ట్రిబ్యూషన్​ హైడ్రో టెక్​ రంగంలో  సాహీటెక్​ ఇండియా  రూ. 1,000 కోట్లు
  • ఇంటిగ్రేటేడ్ స్టీల్​ ప్లాంట్​ ఏర్పాటుకు కృష్ణా పవర్​ యుటిలిటీస్​ రూ. 5,000 కోట్లు, సిమెంట్​ రంగ విస్తరణకు అల్ట్రా బ్రైట్​ సిమెంట్స్​, రెయిన్​ సిమెంట్స్​ రూ.2000 కోట్లకు ఒప్పందాలు చేసుకున్నాయి. 
  • సీతారాం స్పిన్నర్స్​ రూ.3 వేల కోట్లతో టెక్స్​టైల్​ యూనిట్​కు ముందుకు వచ్చింది. ​ 
  • షోలాపూర్​ తెలంగాణ టెక్స్​ టైల్​ అసోసియేషన్ అండ్​ జీనియస్​ ఫిల్టర్స్ పవర్​ లూమ్​ టెక్నికల్​ యూనిట్​కు రూ. 960 కోట్లు పెట్టుబడులు. 
  • ముకేశ్ అంబానీ రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం ‘వంతార’ను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలో అతిపెద్ద ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపుదిద్దుకోనుంది.
  • బాలీవుడ్​ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్​ ఖాన్​ వెంచర్స్ ఇండస్ట్రీస్​​రూ.10వేల కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్, ఫిల్మ్​ అండ్​ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది. 
  • ప్రముఖ సంస్థ అథిరత్ హోల్డింగ్స్ రాష్ట్రంలో 25 కాంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు నెలకొల్పనుంది. వీటిని స్థాపించేందుకు రూ. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి పెంపు కోసం ఇవి కీలకంగా మారనున్నాయి.
  • అపోలో గ్రూప్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యాధునిక విశ్వవిద్యాలయం, వైద్య విద్య, పరిశోధనా కేంద్రం నిర్మాణానికి  రూ. 800 కోట్లు పెట్టనుంది. ఇది భవిష్యత్తు ఆరోగ్య విద్యా రంగానికి కొత్త దిశను చూపనుంది.
  • అంతర్జాతీయ ‘మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్ సంస్థ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాస్ ఇండియా’ తెలంగాణలో ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్  అండ్​ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనుంది.  
  • యూనివర్సిటీ ఆఫ్ లండన్  భాగస్వామ్యంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆధునిక నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో  రాష్ట్రంలో యువతకు  అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభిస్తాయి.
  • ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్  (టీఎమ్‌టీజీ) సంస్థ రూ. 41 వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు చెందిన ఈ సంస్థ హైదరాబాద్‌లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించింది. ఈ మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగాలు రానున్నాయి. 
  • భారత్ ఫ్యూచర్​ సిటీలో బ్రుక్‌ఫీల్డ్  యాక్సిస్ వెంచర్స్ కూటమి రూ. 75 వేల  కోట్లతో  గ్లోబల్ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​, డీప్​ టెక్​ హబ్​ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 
  • పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్​ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్  రూ. 27,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. 

నిన్నటి వరకు ఇదొక కల, ఒక ప్రణాళిక మాత్రమే! కానీ, ఇప్పుడు మీరందరూ భాగస్వాములుగా చేరడంతో నాకు నిన్నటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం వచ్చింది. మీ అందరి మద్దతుతో లక్ష్యాలను సాధిస్తం. తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్​స్టాపబుల్​.

పౌరుల ఆకాంక్షలు, కలలను తెలుసుకున్న తర్వాత.. అధికారుల సాయం, కేంద్ర ప్రభుత్వ నిపుణులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , చివరిగా నీతి ఆయోగ్  సహకారంతో ఈ విజన్​ను రూపొందించాం. గ్లోబల్ సమిట్ ప్రారంభం సందర్భంగా వ్యాపార, కార్పొరేట్, విధానపరమైన, దౌత్య, ప్రభుత్వ రంగాలకు చెందిన దిగ్గజాలు రావడం ఆనందంగా ఉంది.- సీఎం రేవంత్​