ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు కావాలి

ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు కావాలి
  •     ఆర్టీఏకి రూ.450 కోట్లు కేటాయించండి
  •     ప్రభుత్వానికి రవాణా శాఖబడ్జెట్ ​ప్రతిపాదనలు
  •     మంత్రి పొన్నంకు వివరాలు అందజేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు :  బడ్జెట్​లో ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. మహాలక్ష్మి స్కీమ్​తో రోజువారి ఆదాయం సుమారు రూ.5 కోట్ల వరకు తగ్గిందని అధికారులు మంత్రికి తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు, మహాలక్ష్మి స్కీమ్ రియింబర్స్​మెంట్ అద్దె బస్సుల ఓనర్లకు అద్దె పెంపు, సీసీఎస్​కు బకాయిల చెల్లింపు వంటి వాటికి నిధులు పెద్ద మొత్తంలో కావాలని విజ్ఞప్తి చేశారు.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్టీఏ ఆఫీసులకు కొత్త భవనాల నిర్మాణం, కొత్తగా డ్రైవింగ్ ట్రాక్ ల ఏర్పాటుకు నిధులు అవసరమని, ఆర్టీఏకు బడ్జెట్​లో రూ.450 కోట్లు కేటాయించాలని మంత్రిని కోరారు. బడ్జెట్ సన్నాహక సమావేశంలో భాగంగా సోమవారం సెక్రటేరియెట్ లో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులతో మంత్రి పొన్నం సమావేశమయ్యారు. ఆర్టీసీ, ఆర్టీఏ ఖర్చు, ఆదాయంపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాది బడ్జెట్ లో కేటాయించిన నిధులు, విడుదల చేసిన బడ్జెట్, ఈసారి మహాలక్ష్మి పథకం అమలుతో బడ్జెట్ కేటాయింపులు, కొత్త బస్సుల కొనుగోలు తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు.

ఎఫ్, సీసీఎస్, పీఆర్సీ బాండ్స్, అప్పులు, వడ్డీలపై ఆర్టీసీ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి స్కీమ్ పై ఆర్థిక శాఖ మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఈడీలు, జేటీసీలు పాల్గొన్నారు.

నేడు సమీక్ష

రవాణా శాఖ బడ్జెట్ పై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైనాన్స్, ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులతో మంగళవారం సమావేశం కానున్నారు. శాఖకు గతంలో కేటాయించిన బడ్జెట్, కొత్త స్కీమ్​అమలు నేపథ్యంలో ఈసారి పెంచాల్సిన మొత్తంపై సమీక్షలో చర్చించనున్నారు.

మంత్రిని కలిసిన అభ్యర్థులు

తమకు న్యాయం చేయాలని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్​స్పెక్టర్​అభ్యర్థులు మంత్రి పొన్నం ప్రభాకర్​ను కోరారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వల్ల  సర్వీస్ రూల్స్ ను మార్చి నోటిఫికేషన్ ఇవ్వటంతో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు.  స్పందించిన మంత్రి.. నిపుణుల కమిటీ సూచనలు తీసుకొని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.  

బీసీల సంక్షేమ బడ్జెట్‌‌‌‌పై రివ్యూ

బీసీల సంక్షేమానికి సంబంధించి గత బడ్జెట్‌‌‌‌లో కేటాయించిన నిధులు, ఖర్చు తదితర అంశాలపై బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. సెక్రటేరియెట్‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ వెల్ఫేర్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య, స్టూడెంట్ల సంఖ్య, స్కాలర్ షిప్‌‌‌‌ల కోసం కేటాయించిన నిధులు, తదితర అంశాల పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.

వాషర్ మెన్ ఫెడరేషన్ కి దోభీ ఘాట్ల నిర్మాణం, విద్యుత్ సబ్సిడీ, నాయీ బ్రాహ్మణులకు విద్యుత్ సబ్సిడీకి ఖర్చు అవుతున్న నిధులు తదితర అంశాలపై అధికారులు వివరించారు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో అమలవుతున్న బీసీ సంక్షేమానికి సంబంధించిన పాలసీలపై అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.