తెలంగాణ అకడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల

తెలంగాణ అకడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల

హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ ఇయర్ క్యాలెండర్‎ను తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 23, 2022 వరకు పాఠశాలలు పని చేస్తాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది 213 రోజులు పాఠశాలల పనిదినాలుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది 47 రోజులు ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని.. మిగిలిన 166 రోజులు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి క్వార్టర్లీ పరీక్షలు, డిసెంబర్ 1 నుంచి 8 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలుంటాయన్నారు. అదేవిధంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 25లోపు పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలుంటాయని అధికారులు చెప్పారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా.. ఈ ఏడాది అక్టోబర్ 6 నుంచి 17వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుంచి 28 వరకు వారం రోజులు క్రిస్మస్ హాలిడేస్, జనవరి 11 నుంచి 16 వరకు వారం పాటు సంక్రాంతి సెలవులుంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని చెప్పారు.