
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ షిఫ్టింగ్‌తో ఐటీ సర్వర్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఇప్పటి వరకు డీబ్లాక్ లోని సర్వర్ రూమ్ నుంచి సెక్రటేరియట్‌లోని వివిధ విభాగాలకు ఐటీ, సర్వర్ సేవలు అందుతున్నాయి. కేబుల్ ద్వారా అన్ని శాఖలకూ కనెక్టివిటీ అందుతోంది. ఏ శాఖకు చెందిన జీవోలను ఆ శాఖ సెక్షన్ ఆఫీసర్లు వాళ్ల లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా అప్ లోడ్ చేసేవారు. ఇప్పుడు సెక్రటేరియట్కూల్చివేత నేపథ్యంలో ఒక్కో శాఖ ఒక్కో దగ్గరకు షిప్ట్ అవుతుండటంతో వీటి మధ్య కనెక్టివిటీ తెగిపోనుంది. గురువారం కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో త్వరలోనే శాఖల షిఫ్టింగ్ మొదలవనుంది. కీలకమైన సర్వర్ రూమ్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
10 రోజులపాటు నిలిచిపోనున్న సేవలు
సెక్రటేరియట్ షిఫ్టింగ్ ప్రారంభం కానున్నందున వివిధ శాఖల్లోని కంప్యూటర్ల నెట్ వర్క్ కనెక్షన్ ను తొలగించనున్నారు. సదరు శాఖ షిఫ్ట్ అయిన కార్యాలయంలో తిరిగి వాటిని ఏర్పాటు చేయనున్నారు. కనెక్షన్ తొలగించే సమయంలో కీలక సమాచారాన్ని పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ ల్లోకి కాపీ చేయనున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో 38 శాఖలున్నాయి. వీటిని నగరంలోని ఆయా శాఖల కమిషనరేట్లలో సర్దుబాటు చేయనున్నారు. ప్రస్తుతం అన్ని శాఖల జీవోలనూ goir.telangana.gov.in లో ఓపెన్ చేసి చూసే, డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. సర్వర్ రూమ్ ను వేరే చోటికి తరలిస్తుండటంతో కొద్ది రోజులు ప్రభుత్వ జీవోలు చూసే అవకాశం ఉండదని సర్వర్ నిర్వహకులు చెబుతున్నారు. ప్రభుత్వం సర్వర్ రూమ్ ప్లేస్ ఖరారు చేసిన తర్వాత అన్ని సౌకర్యాలూ కల్పించినా సర్వర్ సాధారణంగా పనిచేయడానికి 10 రోజులు పడుతుందని వివరిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 1989 వరకు మాన్యువల్ గా జీవోలు జారీ చేశారు. ఆ తర్వాత జీవోల జారీ ఆన్ లైన్ ద్వారా కొనసాగుతోంది. మాన్యువల్ గా జారీ చేసిన జీవోలు ఇప్పటికీ సెక్రటేరియట్‌లోని కే బ్లాక్ లో భద్రంగా ఉన్నాయి.
ఆదేశాలు రాగానే షిఫ్టింగ్: ఐటీ సర్వర్ నిర్వాహకుడు
సర్వర్ రూమ్ షిఫ్టింగ్‌పై ఇంకా ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం ఇంటర్ నెట్, ఇంట్రానెట్ ద్వారా సర్వర్లు పనిచేస్తున్నాయి. ఇంట్రానెట్ ద్వారా జీవోల అప్ లోడ్, సవరణలు చేస్తున్నాం. ఆదేశాలు వచ్చిన తర్వాత సర్వర్‌ను కొత్త ప్లేస్ కు మార్చాలి. ఈ సమయంలో జీవోలు పబ్లిక్ డోమైన్ లో అందుబాటులో ఉండవు. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.