మగ్ర శిక్ష ఉద్యోగులకు 5 శాతం జీతం పెంచండి..కేంద్రానికి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రపోజల్స్ రెడీ 

మగ్ర శిక్ష ఉద్యోగులకు 5 శాతం జీతం పెంచండి..కేంద్రానికి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రపోజల్స్ రెడీ 
  • ఈ ఏడాది రూ. 2 వేల కోట్లకుపైగా నిధులివ్వాలని రిక్వెస్ట్
  • 28న ఢిల్లీలో సమగ్ర శిక్ష పీఏబీ మీటింగ్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. సిబ్బంది జీతాలను 5 శాతం పెంచాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కేంద్రానికి ప్రపోజల్స్ రెడీ చేశారు. ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 20 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

నిజానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలను 15 నుంచి 20 శాతం పెంచాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కారు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చేసేదేమీ లేక నిధుల కోసం కేంద్రం పరిధిలోని పీఏబీని అధికారులు ఆశ్రయించారు. గతేడాది (2025–26) తెలంగాణకు సమగ్ర శిక్ష కింద కేంద్రం రూ. 1,805 కోట్ల నిధులు ఇవ్వగా.. ఈ ఏడాది (2026–27) ఆ మొత్తాన్ని రూ. 2 వేల కోట్లకు పైగా పెంచాలని అధికారులు కోరారు.

ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లోనే ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కూడా చేర్చారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వాటా 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం ఉంటుంది. ఈ క్రమంలో 5 శాతం పెంపు ప్రతిపాదనలకు కేంద్రం మొగ్గు చూపుతుందా.. లేదా అన్నది ఈ నెల 28న జరిగే సమావేశంలో తేలనుంది. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఐదేండ్లుగా అదే జీతం..

రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద కేజీబీవీలు, యూఆర్ఎస్‌‌‌‌లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, ఏపీఓలు, మెసేంజర్లు, పీటీఐలు ఇలా వివిధ కేడర్లలో 19 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి చివరిసారిగా 2021లో గత ప్రభుత్వం పీఆర్సీలో భాగంగా 30 శాతం జీతాలు పెంచింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు వీరికి పైసా వేతనం పెరగలేదు. గతేడాది సమ్మె చేసిన సమయంలో జీతాలు పెంచుతామని సర్కారు హామీ ఇచ్చి ఏడాది దాటినా అమలుకు నోచుకోలేదు. చివరికి సమ్మె కాలానికి జీతం కూడా ఇవ్వలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అధికారులు ఇప్పుడు పీఏబీ ముందు ఉంచనున్నారు.