- ఏపీ సర్కారుకు తెలంగాణ లేఖ
- తెలంగాణ స్థానికత ఉద్యోగుల నుంచి వివరాలు తీసుకుంటున్న ఏపీ
హైదరాబాద్ ,వెలుగు: తెలంగాణ స్థానికత ఉండి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు లేఖ రాసింది. గతేడాది మే, జూన్‌లో రెండు సార్లు లేఖ రాసిన జీఏడీ అధికారులు తాజాగా మరోసారి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల వివరాలను వివిధ శాఖల అధికారులు సేకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దానికిపైగా గడిచింది. అయినప్పటికీ, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికీ సొంత రాష్ట్రానికి రాలేదు.
దీంతో వందలాది మంది తెలంగాణ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చి సోమవారం ఏపీకి వెళుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆల్ ఇండియా సర్వీసులు, రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. అయితే జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో అనేక సాంకేతిక, చట్టపరమైన అంశాల కారణంగా స్పష్టత లేకపోయింది.
తెలంగాణకు వచ్చేందుకు 1,943 మంది ఆప్షన్లు
ఏపీలో పనిచేస్తున్న సుమారు 1,943 మంది ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చారు. వీరిని తెలంగాణకు కేటాయించే ప్రక్రియపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే, ఇందులో ఏపీ ఉద్యోగులు సైతం తెలంగాణకు వస్తమని ఆప్షన్లు పెట్టుకోవటం గమనార్హం. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పనిచేసి రాష్ర్ట విభజన తర్వాత ఏపీకి వెళ్లామని వాళ్లు చెబుతున్నారు.
తమ నివాసాలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఏపీ ఉద్యోగులు చెబుతుండటంపై తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ బదిలీల్లో భాగంగా దాదాపు 200 మంది ఏపీ పోలీసు అధికారులు తెలంగాణకు రానుండటంపై తెలంగాణ స్థానిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ సీనియారిటీ, పదోన్నతులకు భంగం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్హులు 350 మంది
తెలంగాణ స్థానికత ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ , ఓపెన్ కోటాలో రిక్రూట్ అయిన ఉద్యోగులు ఏపీలో సుమారు 350 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ల కుటుంబాలు, పిల్లలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నివసిస్తున్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి సోమవారం ఏపీకి వెళుతున్నామని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. 2014 నుంచి తాము తెలంగాణకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవటం లేదంటున్నారు.
మాది తెలంగాణే.. మేం స్థానికులమే
రాష్ట్ర విభజన తర్వాత మా జీవితాలు అనిశ్చితిలోకి నెట్టివేయబడ్డాయి. మేం తెలంగాణ జిల్లాలకు చెందిన స్థానికులమే. కాని కేటాయింపుల్లో లోపాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మా తప్పు కాదు.
పండుగలు, కుటుంబ కార్యక్రమాలు, అనారోగ్య పరిస్థితుల్లో కూడా మేం వెంటనే ఇంటికి చేరుకోలేకపోతున్నాం. మేం ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా లేము. మా సొంత రాష్ట్రంలో పని చేసే హక్కు మాత్రమే కోరుతున్నాం.
లక్ష్మీనారాయణ, ప్రెసిడెంట్, తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర
మాకు న్యాయం చేయండి
మా సమస్యను ‘ఆంధ్రా – తెలంగాణ’ వివాదంగా చూడకండి. ఇది జీవితాల విషయం. మాకు ఎవరి ఉద్యోగాలపై ఆశ లేదు. మా స్వస్థలంలో, మా కుటుంబంతో గౌరవంగా పనిచేసే అవకాశం మాత్రమే కావాలి. రాష్ర్ట విభజన సమయంలో పరిపాలన లోపాల వల్ల తెలంగాణ వాళ్లం ఉద్యోగుల విభజన టైమ్ లో ఏపీకి కేటాయించబడ్డం. వేలాది కుటుంబాల భవిష్యత్తు ఈ నిర్ణయంపై ఆధారపడి ఉంది. రాష్ట్రం కోసం పోరాడిన వాళ్లం ఇప్పుడు అదే రాష్ట్రంలో స్థానం కోసం ఎదురు చూస్తున్నాం.
అంజయ్య, జనరల్ సెక్రటరీ , తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర
