శాలరీ కష్టాలు.. 15వ తేదీ వచ్చినా పడని జీతం

శాలరీ కష్టాలు.. 15వ తేదీ వచ్చినా పడని జీతం

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఉద్యోగులను సాలరీ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతి నెలా 5వ తేదీలోపే పడే జీతాలు 15వ తారీఖు వచ్చినా పడడం లేదు. ఏడాదిన్నరగా ఇదే దుస్థితి నెలకొందని, సంస్థ ఏర్పాటైన 21 ఏండ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని సంస్థ సీనియర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాలరీస్‌‌‌‌తోపాటు ఇతర బెనిఫిట్స్ మంజూరులోనూ సెర్ప్ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

15వ తేదీ వచ్చినా రాని శాలరీ..

గతంలో ప్రతి నెలా 5వ తేదీలోపు అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్‌‌‌‌మెంట్ పద్ధతిలో జీతాలిచ్చేవారు. సెర్ప్‌‌‌‌లో ఉన్న ఫండ్స్‌‌‌‌ను ఉద్యోగుల శాలరీలకు అడ్జస్ట్ చేసి.. ప్రభుత్వం జమ చేసిన తరువాత సంస్థ అవసరాలకు వాడేవారు. అయితే ఏడాదిన్నరగా ఈ అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్‌‌‌‌మెంట్ పద్ధతిని పక్కన పెట్టడంతో ప్రతి నెలా జీతం లేట్‌‌‌‌గా వస్తోంది. అక్టోబర్ నెల జీతాన్ని ఈ నెల 5వ తేదీనే సంస్థ ఖాతాలో ప్రభుత్వం జమ చేసినా ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటికీ సిబ్బందికి శాలరీస్ ఇవ్వలేదని సెర్ప్ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజుల్లో శాలరీస్ వస్తాయో చెప్పలేమని ఉన్నతాధికారులు అంటున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇతర బెనిఫిట్స్ మంజూరులోనూ అదే నిర్లక్ష్యం..

అర్హులైన ఉద్యోగులకు రెండు నెలలుగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అందలేదు. అలాగే సిబ్బందికి జూన్ నెలకు సంబంధించిన 30% పెంపుదల ఎరియర్స్ ఇప్పటివరకు చెల్లించలేదు. అలాగే సెర్ప్‌‌‌‌లో పనిచేసే ఉద్యోగులకు కొన్నేండ్లుగా ట్రాన్స్‌‌‌‌ఫర్లు లేవు. సిబ్బంది రీయిన్ స్టేట్మెంట్ ఫైళ్లు, ఎఫెక్ట్ డేట్ ఫైళ్లు, హెచ్ఆర్ సంబంధిత ఫైళ్లు ఏడాదిగా పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 48 లక్షల మంది మహిళలు ఉన్న స్వయం సహాయక సంఘాలను పర్యవేక్షిస్తున్న సెర్ప్​కు పూర్తి స్థాయి సీఈవో, డైరెక్టర్లు లేకపోవడంమూ  సమస్యగా మారింది. సీఈవో స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారి.. తమ సమస్యలు చెప్పుకునేందుకు అపాయింట్‌‌‌‌మెంట్ ఇవ్వట్లేదని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు తీర్చకుంటే సెర్ప్ ఆఫీస్​ను ముట్టడిస్తం
 
ఈనెల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. గతంలో అమలులో ఉన్న అడ్వాన్స్ అండ్ అడ్జస్ట్‌‌‌‌మెంట్ పద్ధతి ప్రకారం ప్రతి నెలా 1వ తేదీన శాలరీస్ ఇవ్వాలి. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి. ఈ విషయమై సెర్ప్  ఆధికారులు నాలుగు రోజుల్లో స్పందించకపోతే బుధ, గురు వారాల్లో సెర్ప్ ఉద్యోగులం కుటుంబ సభ్యులతో కలిసి సెర్ప్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తం. – ఎ.నర్సయ్య, కుంట గంగాధర్ రెడ్డి, సెర్ప్ ఎంప్లాయీస్ యూనియన్స్‌‌‌‌ జేఏసీ నేతలు