- జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా కార్యాచరణ
- త్వరలో పబ్లిక్ యాక్సెస్ డాష్ బోర్డ్
- గాలి నాణ్యత నిర్వహణపై సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
- భవిష్యత్తు తరాలకు హాని చేసేది నిజమైన అభివృద్ధి కాదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశుభ్రమైన గాలి లేకుండా సాధించే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదని, అది భవిష్యత్తు తరాలకు చేసే హాని అని హెచ్చరించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్‌ఆర్‌డీ) లో ‘గాలి నాణ్యత సూచీ, నిర్వహణ’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలుష్య ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు రెండు జీహెచ్‌ఎంసీ జోన్లలో ప్రయోగాత్మకంగా ప్రత్యేక బృందాలను (స్పెషల్ టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరిస్తామని తెలిపారు. ప్రజలకు ఎప్పటికప్పుడు గాలి నాణ్యత వివరాలు తెలిసేలా త్వరలో పబ్లిక్ డాష్ బోర్డ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
తెలంగాణ సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోందని, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి చెప్పారు. అభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి పోటీ కాదని, రెండూ సమాంతరంగా సాగాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు 2024లో 40 కొత్త మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది కర్బన ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
నివాస ప్రాంతాల్లో పరిశ్రమలు.. ప్రమాదకరమే
జీడిమెట్ల వంటి పారిశ్రామిక వాడలు ఒకప్పుడు నగర శివార్లలో ఉండేవని, ఇప్పుడు అవి నివాస ప్రాంతాల మధ్యకు వచ్చేశాయని భట్టి గుర్తుచేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ఇలాంటి పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో 32 శాతం కాలుష్యం పరిశ్రమల వల్లే వస్తోందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జోనింగ్ నిబంధనలు, భూ వినియోగంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల తరలింపు, పునర్ వ్యవస్థీకరణపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.
కేవలం ప్రభుత్వ చర్యలతోనే గాలి కాలుష్యాన్ని అరికట్టలేమని, పౌర సమాజం, పరిశ్రమలు కూడా భాగస్వాములు కావాలని భట్టి పిలుపునిచ్చారు. ప్రజా రవాణాను వినియోగించడం, చెత్తను తగలబెట్టకపోవడం వంటి మార్పుల ద్వారా పెద్ద ఫలితాలు సాధించవచ్చన్నారు. మనం మన పిల్లలకు కాలుష్య కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఇస్తామా? లేక ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిస్తామా? అనేది మన చేతుల్లోనే ఉందని అన్నారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
