దసరా నుంచి స్కిల్​ వర్సిటీ.. ప్రాథమికంగా 6 కోర్సులు ప్రారంభం

దసరా నుంచి స్కిల్​ వర్సిటీ.. ప్రాథమికంగా 6 కోర్సులు ప్రారంభం
  • త్వరలో యూనివర్సిటీ లోగో, వెబ్​సైట్ రూపకల్పన
  • ముచ్చర్లలో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులు
  • ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు: ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’లో పలు కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీటిలో అక్టోబర్ 12 (దసరా)న ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు, విధి విధానాల ఖరారు, ప్రారంభ తేదీ వంటి అంశాలపై శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్​లో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారన్నారు. పనులు కంప్లీట్ అయ్యేదాకా వర్సిటీని తాత్కాలికంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా లేదంటే న్యాక్, నిథమ్ లో నిర్వహిస్తామన్నారు. 

‘‘స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన లోగో, వెబ్​సైట్ ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ వర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి మంచి సాలరీతో ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే ఈ యూనివర్సిటీ చైర్మన్​గా ఆనంద్ మహీంద్రాను, కో చైర్మన్​గా శ్రీనివాస సి.రాజును నియమించాం. వర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు 20 కోర్సులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ముందుగా స్కూల్ ఆఫ్ ఈ -కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తాం’’అని సీఎస్ అన్నారు. వివిధ విభాగాల్లో శిక్షణ కోసం ఎస్బీఐ, న్యాక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టీవీఏజీఏ, అదానీ కంపెనీలతో పాటు సీఐఐ భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించాయని తెలిపారు.