స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం : మున్సిపల్ శాఖ అధికారులు

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం :  మున్సిపల్  శాఖ అధికారులు
  • బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ అవార్డులు
  • గంగా పరీవాహక రాష్ట్రాలు, కుంభమేళా పనితీరుకు పురస్కారాలు
  • సౌత్ జోన్  కేటగిరీ తొలగింపు
  • 4,100 మున్సిపాలిటీల్లో 2 వేల ర్యాంకు లోపే తెలంగాణ అర్బన్ లోకల్ బాడీలు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర  ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్  2024 అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. గైడ్ లైన్స్  ఒకలా ఇచ్చి అవార్డులు ఇచ్చే ముందు వాటిలో మార్పులు చేసి అవార్డులు ప్రకటించారని మున్సిపల్  శాఖ అధికారులు తెలిపారు. దీంతో బీజేపీ పాలిత రాష్ర్టాల మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎక్కువ అవార్డులు వచ్చాయని అంటున్నారు. మరోవైపు గంగా పరీవాహక రాష్ర్టాల్లో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అవార్డులు వచ్చేలా ఒక కేటగిరీ, ఇటీవల జరిగిన కుంభమేళాలో ఉత్తమ పనితీరు కనబరిచిన అర్బన్  లోకల్  బాడీల కేటగిరీ అని కొత్తగా చేర్చి అవార్డులు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2023కు, 2024 సర్వేక్షణ్ మార్గదర్శకాల్లో భారీగా మార్పులు చేశారు.

 2023లో 20 వేలు, 20 వేల నుంచి 50 వేలు, 50 వేల నుంచి లక్ష, లక్ష నుంచి 10 లక్షలు, 10 లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో ర్యాంకులు ప్రకటించారు. దీంతోపాటు  దేశవ్యాప్తంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్  జోన్లుగా వేర్వేరుగా అవార్డులు ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రానికి సౌత్  కేటగిరీలో 25కుపైగా అవార్డులు దక్కేవని అధికారులు చెబుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖలో అవార్డులు ఎంపిక చేసే అధికారుల్లో నార్త్  స్టేట్స్  ఆఫీసర్లు ఉన్నారని, అవార్డుల్లో కూడా రాజకీయాలు, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నది చూస్తున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మన రాష్ర్టంలో కంటే ఒడిశా మునిసిపాలిటీలు నీట్ గా ఉండవని, అయినా అక్కడ అవార్డులు ఇచ్చారంటున్నారు.

 చెత్త సేకరణ, తడి, పొడిచెత్త వేరు వేరుచేయడం, కరెంట్ తయారీ, మురుగు నీటి శుద్దీకరణ, గ్రీనరీ, టాయిలెట్లు, ఇలా ఎన్నో కేటగిరీల్లో తెలంగాణ అర్బన్  లోకల్  బాడీలు ఇతర రాష్ర్టాల కన్నా ఎంతో ముందున్నాయి.  గత మూడేళ్లు తెలంగాణ రాష్ర్టంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అవార్డులు రాగా ఈసారి మాత్రం జీహెచ్ఎంసీ కి మాత్రమే అవార్డు వచ్చింది. కంటోన్మెంట్ ను త్రీస్టార్ గా గుర్తించారు.  ఒక్క జీహెచ్ఎంసీకి మాత్రమే 7 స్టార్ గుర్తింపు దక్కింది. కంటోన్మెంట్ కు ఆ కేటగిరీలో అవార్డు వచ్చిందని , అది అర్బన్  లోకల్ బాడీ కేటగిరీలోకి రాదని అధికారులు అంటున్నారు.  దేశంలో 4100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా ఇందులో తెలంగాణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 1800 ర్యాంకులోపే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో (2023లో) సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట్‌‌‌‌‌‌ సహా 18 మున్సిపాలిటీలు జోనల్  స్థాయిలో అవార్డులు గెలుచుకున్నాయి. 

78 అవార్డులు 

స్వచ్ఛ సర్వేక్షణ్  అవార్డులు, స్వచ్ఛ భారత్  మిషన్‌‌‌‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే సర్వే ద్వారా దేశంలోని నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం వంటి అంశాల ఆధారంగా అవార్డులు అందిస్తారు. 2024–-25 సంవత్సరంలో 4 ప్రధాన కేటగిరీల్లో మొత్తం 78 అవార్డులు ప్రకటించారు. నగరాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, స్థిరమైన వ్యర్థ నిర్వహణను ప్రోత్సహించడం, ఆరోగ్యకర సమాజ నిర్మాణం కేటగిరిలో అవార్డులు ఇచ్చారు. ఏపీలో వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతికి అవార్డులు దక్కాయి.