
- షెడ్యూల్ పై స్టే ఇవ్వలేదని సర్కారుకు లేఖ
- పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చన్న ఈసీ
- న్యాయ నిపుణులతో చర్చిస్తున్న కమిషన్
- ఇదే అంశంపై 16న రాష్ట్ర కేబినెట్ భేటీ
హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ స్థానిక ఎన్నికల కాక మొదలైంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ బయటికి రావడంతో కదలిక మొదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. హైకోర్టు కేవలం రిజర్వేషన్లపైనే స్టే విధించిందని, ఎన్నికల ప్రక్రియ పై కాదని పేర్కొంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లే అంశం ఉందని, దీనిపై అభిప్రాయం చెప్పాలని కోరింది.
దీనికి ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదే అంశంపై న్యాయ నిపుణులతో ఈసీ చర్చిస్తోంది. పాత నిబంధన ప్రకారం ఎన్నికలకు వెళ్తే మళ్లీ షెడ్యూల్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మొత్తం బీసీలకు 42% పద్ధతిన ఇప్పటికే ఖరారై ఉన్నాయి. మళ్లీ రిజర్వేషన్లన్నింటినీ లెక్కించి లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 15న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది.
ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ పాత నిబంధన ప్రకారం వెళ్లాల్సి వస్తే.. పార్టీ పరంగా టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అధికార పార్టీ పాటించినా మిగతా పార్టీలు పాటిస్తాయా..? లేదా..? అన్నది అనుమానమే. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఒక వేళ పాత పద్ధతిన వెళ్లాల్సి వస్తే షెడ్యూల్ మొత్తాన్ని మార్చేందుకు సమయం కూడా పట్టే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టుకు సర్కారు
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తదితరులు జూమ్ మీటింగ్ లో మాట్లాడారు.
కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి న్యాయపోరాటం చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యంగా జీవో9 అమలుపై విధించిన స్టేపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతోంది.