పెండింగ్ బిల్లులు రిలీజ్..గ్రామ పంచాయతీలకు రూ.104 కోట్లు

పెండింగ్ బిల్లులు రిలీజ్..గ్రామ పంచాయతీలకు రూ.104 కోట్లు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇందుకు సంబంధించి రూ.104 కోట్లు రిలీజ్​ చేసింది. పల్లెలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు వివిధ పనులు చేసే బాధ్యత కార్యదర్శులపై పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇటు రాష్ట్రం ఇవ్వాల్సిన స్టేట్​ ఫైనాన్స్ ఫండ్స్ నిలిచిపోయాయి. 

దీంతో కార్యదర్శులు గ్రామాల్లో  పారిశుధ్య పనులు, ఇతర  పనుల కోసం జేబులోంచి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక్కో కార్యదర్శి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. కొన్ని నెలులుగా నిధులు పెండింగ్ ఉండటంతో కార్యదర్శులపై ఆర్థిక భారం పెరిగిపోయింది. 

పలుమార్లు పీఆర్, ఆర్డీ డైరెక్టర్, మంత్రి సీతక్కకు వినతిపత్రాలు అందించారు. దీంతో సీతక్క చొరవ తీసుకుని నిధుల విడుదలకు కృషి చేశారు. కాగా, నిధుల విడుదలతో పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకుని.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ.104 కోట్లు విడుదల చేశారని తెలిపారు.