
- కొత్తగా 13 అర్బన్ డెవలప్మెంట్అథారిటీలు
- ప్రస్తుతం ఉన్న 6 అథారిటీల పరిధి జిల్లామొత్తానికి విస్తరణ
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా 13 అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే, మరో ఆరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధిని వాటి జిల్లాల మొత్తానికి విస్తరించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటయిన 13 అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల్లో ఆదిలాబాద్, జోగుళాంబ గద్వాల, కాగజ్ నగర్, కామారెడ్డి, కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి ఉన్నాయి.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 6 (హెచ్ఎండీఏ, నల్గొండ, గజ్వేల్, కొడంగల్, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ, యాదగిరిగుట్ట) అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు ఉండగా.. వాటి పరిధిని పెంచారు. కరీంనగర్ జిల్లా మొత్తాన్ని శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోకి, ఖమ్మం జిల్లా మొత్తాన్ని స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా), రాజన్న సిరిసిల్ల మొత్తాన్ని వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (వీటీడీఏ), మహబూబ్ నగర్ జిల్లా మొత్తాన్ని మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా), సిద్దిపేట జిల్లా మొత్తాన్ని సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా), నిజామాబాద్ జిల్లా మొత్తాన్ని నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(నుడా) పరిధిలోకి ప్రభుత్వం తెచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతుల కల్పన, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, సాటిలైట్ టౌన్ షిప్ అభివృద్ధి కోసమే అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(యూడీఏ) ల పరిధిని విస్తరించామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రోడ్ నెట్‌వర్క్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు, సాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందించుకోవడం యూడీఏల పని అని అందులో వివరించింది. హైదరాబాద్ చుట్టూ అర్బనైజేషన్ కావడంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సక్సెస్ అయిందని, ఇలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అభివృద్ధి విస్తరణ కోసం యూడీఏలను విస్తరిస్తున్నామని వెల్లడించింది.