డబుల్​ బెడ్రూం ఇండ్లు మెడికల్​ కాలేజీలకు

డబుల్​ బెడ్రూం ఇండ్లు మెడికల్​ కాలేజీలకు
  • స్టూడెంట్​ హాస్టళ్ల కోసం సిద్దిపేట, నల్గొండల్లో అప్పగింత..
  • సిబ్బందికి క్వార్టర్లుగానూ వినియోగం
  • ఇప్పటికే స్వాధీనం చేసుకుంటున్న కాలేజీ యాజమాన్యాలు
  • క్లాసులు మొదలుకాగానే హాస్టళ్లకు కేటాయింపులు
  • మరోవైపు ఇండ్ల కోసం వేలాది మంది పేదల ఎదురుచూపులు
  • పూర్తయిన ఇండ్లను కాలేజీలకు ఇవ్వడంతో నిరాశ

వెలుగు నెట్​వర్క్: కొత్తగా నిర్మించిన డబుల్​ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మెడికల్​ కాలేజీలకు అప్పగిస్తోంది. మెడికల్​ కాలేజీల స్టూడెంట్లు, సిబ్బందికి ఈ ఇండ్లే హాస్టళ్లు, క్వార్టర్లుగా మారుతున్నాయి. ఇప్పటికే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ 50 డబుల్​ బెడ్రూం ఇండ్లను స్వాధీనం చేసుకుంది. స్టూడెంట్లకు వాటిలోనే హాస్టళ్లను నిర్వహిస్తోంది. ఇదే తరహాలో ఇప్పుడు నల్గొండ మెడికల్​ కాలేజీకి సర్కారు లైన్​ క్లియర్​ చేసింది. జిల్లా కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గొల్లగూడ వద్ద నిర్మించిన డబుల్​ ఇండ్లను కాలేజీకి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. డబుల్​ బెడ్రూం ఇండ్లను తమకు కేటాయించాలని గత నెలలోనే (మొదటి పేజీ తరువాయి)

మెడికల్​ కాలేజీ యాజమాన్యం పంచాయతీరాజ్​ విభాగానికి ప్రతిపాదనలను సమర్పించింది. అప్పట్నుంచీ అప్పగింతలకు అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇటీవలే డబుల్​ ఇళ్ల ప్రాంగణంలో మెడికల్​ కాలేజీ హస్టల్​ బోర్డులను తగిలించారు. స్టూడెంట్లకు అవసరమైన హస్టళ్లతో పాటు సిబ్బంది క్వార్టర్ల నిర్వహణకు త్వరలోనే ఈ ఇళ్లను కేటాయించనున్నారు.

వసతులు చూపించేందుకు..

కొత్త మెడికల్​ కాలేజీ మంజూరు కావాలంటే మెడికల్​ కౌన్సిల్​ఆఫ్​ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతులు ఉండాలి. మెడికల్ కాలేజీ స్టూడెంట్లు, సిబ్బందికి అవసరమైన హాస్టళ్లు, ఇతర వసతులను కల్పించాలి. దాంతో సరిపడా వసతులు అందుబాటులో ఉన్నాయని ఎంసీఐ తనిఖీ బృందానికి చూపించేందుకు.. గృహ ప్రవేశాలకు రెడీగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం ఎంచుకున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నల్గొండ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్​ ఫస్టియర్​ క్లాసులు ఆగస్టు నుంచి ప్రారంభమవనున్నాయి. జాతీయ స్థాయిలో మెడిసిన్​లో సీట్లు సాధించిన విద్యార్థులు వచ్చే నెలలో ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం విద్యార్థులు, టీచింగ్​ డాక్టర్లు, సిబ్బంది కలిపి సుమారు తొమ్మిది వందల మంది ఉంటారు. విద్యార్థులతో పాటు ఇరవై శాతం సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాల్సి ఉంటుందని, అందుకు అనువుగా ఉందనే డబుల్​ బెడ్రూం ఇళ్లను ఎంపిక చేశారని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.

సిద్దిపేటలోనూ అదే పరిస్థితి

సిద్దిపేటలో ఏడాది కిందటే 2,200 డబుల్​ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దాదాపు 10,500 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు రెవెన్యూ అధికారులు ఏడాది కిందటే ఒక టీమ్​ ను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ ఎంపిక ప్రక్రియ మొదలు కాలేదు. మరోవైపు నిర్మాణాలు పూర్తయి, అందంగా ముస్తాబైన ఇళ్లలో కొన్నింటిని మెడికల్​ కాలేజీకి అప్పగించటంతో.. మిగతా ఇండ్లన్నీ ఖాళీగా బోసిపోతున్నాయి. ఇప్పటికీ లబ్ధిదారులకు కేటాయించక పోవడంతో అటుగా వెళ్లిన ఆకతాయిలు కిటీకీల అద్దాలు, డోర్లను ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల కోడ్​ కారణంగా ఇండ్ల కేటాయింపు ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు.

పేదలకు ఇండ్లిచ్చేదెప్పుడు?

నిరుపేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం డబుల్​ బెడ్రూం పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నల్గొండలో జీ ప్లస్​ టూ మోడల్​లో ఒకే చోట 560 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 340 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో ఫ్లాట్​కు ప్రభుత్వం రూ. 5.30 లక్షలు ఖర్చు చేసింది. వేలాది మందిపేదలు తమకు ఇండ్లను కేటాయిస్తారన్న ఆశతో నల్గొండ మున్సిపల్​ ఆఫీసులో దరఖాస్తులు పెట్టుకున్నారు. అర్జీల సంఖ్య రెండు వేలకు దాటిపోయింది. వారంతా నాలుగేళ్లుగా ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈలోగా మెడికల్​ కాలేజీకి ఈ డబుల్​ ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో నిరుపేదల ఆశలు ఆవిరవుతున్నాయి.