కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది

కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరైన సమగ్ర నివేదిక రాష్ట్రం ఇవ్వలేదన్నారు. తాను స్వయంగా రాష్ట్ర అధికారులను అడిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అధికారులతో రివ్యూ చేసి పంటనష్టం పై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గడిచిన ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

GHMC లో రూ.10వేల పంపిణీలో టీఆర్ ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలకు ముందు డబ్బులు ఇచ్చి వెనుక లాక్కుంటున్నారని ఆరోపించారు. గులాబి కండువాలు వేసుకున్న నేతలు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. TRS కార్యకర్తలు దోచుకునేందుకేనా 10 వేలు పంచేదని ప్రశ్నించారు. రైతులకు వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం అందిస్తుందో చెప్పాలన్నారు. కరోనా సమయంలో రాష్ట్రం ఏమి చేసిందో..కేంద్రం ఏమి ఇచ్చిందో చర్చకు సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ లకు, మున్సిపాలిటీలకు డైరెక్ట్ గా నిధులు ఇస్తుందన్నారు. టీఆరెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రాంతాలను దూరం పెట్టడం వాస్తవం కాదా అని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారన్న కిషన్ రెడ్డి… కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు కేంద్ర సహకారంతో నిధులు సమకూరాయన్నారు.

సిద్దిపేట లో పోలీస్ తీరు పై స్పందించిన కిషన్ రెడ్డి.. ఎన్నికల సమయంలో కోడ్ ఉంటుందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా నేను చర్యలు తీసుకోలేనన్నారు.