ఎల్ఆర్ఎస్ తర్వాత జీవో 59..125 గజాలలోపు ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్

ఎల్ఆర్ఎస్ తర్వాత జీవో 59..125 గజాలలోపు ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్
  • పెండింగ్‌‌ అప్లికేషన్లను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు
  • అక్రమ అప్లికేషన్లు మినహా.. మిగతా వాటిని క్లియర్‌‌‌‌ చేసే యోచనలో అధికారులు
  • వచ్చే నెలలో ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏర్పాట్లు
  • దాదాపు రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏడాదిన్నరగా పెండింగ్‌‌లో ఉన్న జీవో 59 అప్లికేషన్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ జీవో కింద 58 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడంద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.6 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఒకవైపు ఎల్ఆర్ఎస్​ ప్రక్రియ కొనసాగుతుండటంతో.. వచ్చే నెలలోనే జీవో 59పైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమంగా భూముల క్రమబద్ధీకరణకు ప్రయత్నించడంతో ఈ ప్రక్రియను నిలిపివేసిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు అక్రమ దరఖాస్తులను మినహాయించి అర్హులైన వారి దరఖాస్తులను పరిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

125 గజాలలోపు ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబర్ 30న జీవో 59 జారీ చేశారు. 2022, 2023లో స్వల్ప మార్పులతో ఈ జీవోను పొడిగించారు. దీని ప్రకారం 125 నుంచి 250 గజాల స్థలం ఉన్నవాళ్లు మార్కెట్ ధరలో 25%, 250- నుంచి 500 గజాలకు 50%, 500- నుంచి 750 గజాలకు 75శాతం, 750 గజాలకు పైబడి జాగ ఉన్నవాల్లు 100శాతం చెల్లించాలి. అలాగే, జీవో 58 ప్రకారం 125 గజాల లోపు నిర్మాణాలున్న స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో జీవో 59ని అడ్డుపెట్టుకుని విలువైన భూములను అక్రమంగా క్రమబద్ధీకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌లోనే 20 ఎకరాలకు పైగా భూమిని కొట్టేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2023 నవంబర్‌‌లో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్‌‌లను నిలిపివేసి, లావాదేవీలపై నిషేధం విధించారు. 2022, 2023లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 31 వేలు, మిగతా జిల్లాల్లో 26 వేల దరఖాస్తులతో మొత్తం 57 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 32,788 దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేశారు. 10 వేల మందికి పైగా ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్‌‌లు పొందగా, 3 వేల మందికి పైగా డబ్బులు చెల్లించినా డీడ్‌‌లు జారీ కాలేదు. ఈ ప్రక్రియ మధ్యలోనే 2023 డిసెంబర్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో 59 పోర్టల్‌‌ను నిలిపివేసింది.

సామాన్యులకు న్యాయం చేసేందుకే..

డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు చెల్లించినవారు, పాక్షికంగా చెల్లించినవారు, తనిఖీలు పూర్తి చేసినవారు, కన్వేయన్స్ డీడ్‌‌లు పొందినవారు సైతం ప్రభుత్వ నిషేధంతో భూములపై లావాదేవీలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన వారికి హక్కులు కల్పించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్‌‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అక్రమాలను గుర్తించి, అర్హులైనవారి భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం తేవడంతోపాటు సామాన్యులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అందిన నివేదిక ప్రకారం, ఈ జీవో అమలు నిలిపివేయడానికి ముందు రూ.534 కోట్ల ఆదాయం వచ్చింది. మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా రూ.500 కోట్లు, అధిక విలువ గల భూముల క్రమబద్ధీకరణ ద్వారా రూ.5,500 కోట్లు, జీవో 76, 118 దరఖాస్తుల ద్వారా రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.