లోగో లొల్లి: సర్కారు వర్సెస్ బీఆర్ఎస్

లోగో లొల్లి: సర్కారు వర్సెస్ బీఆర్ఎస్
  • రాచరికపు ఆనవాళ్లు  తొలగిస్తూ కొత్త డిజైన్
  • మార్పును అంగీకరించని బీఆర్ఎస్ పార్టీ
  • నిన్న వరంగల్ లో, ఇవాళ చార్మినార్ దగ్గర ధర్నా
  • ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన టీ కాంగ్రెస్
  • తుది మెరుగులు దిద్దుకుంటున్నలోగో
  • సోషల్ మీడియాలో 3 లోగోల చక్కర్లు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో మార్పు వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అది రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులు చేయిస్తోంది. లోగో, తెలంగాణ రాష్ట్రగీతంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

రాచరికపు ఆనవాళ్లు.. రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దని ఆదేశించడంతో.. పలు నమునాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా.. అమరుల త్యాగాలు, పోరాట పటిమ ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని సీఎం రేవంత్ ఇటీవలే ఢిల్లీలో హింట్ ఇచ్చారు. ఆ మేరకు నాలుగైదు నమూనాలు కూడా సిద్ధం చేశారు రుద్ర రాజేశం. నిన్న సీఎంతో చిత్రకారుడు రాజేశం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మూడు లోగోలను ముఖ్య మంత్రి ముందుంచారు.  ఈ నమూనాల్లో కాకతీయ తోరణం లేదు. ఒక లోగోలో చార్మినార్, మరో లోగోలో బుద్ధుడు ఉన్నారని సమాచారం. అమరుల స్థూపం ఉండేలా మరో లోగో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారో తేలాల్సి ఉంది. 

నిన్న వరంగల్.. ఇవాళ చార్మినార్

కాకతీయ కళాతోరణాన్ని లోగో నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న వరంగల్ లోని కాకతీయ కళాతోరణం వద్ద ఆందోళనకు దిగింది. కాకతీ యుల కళాతోరణాన్ని తొలగిస్తే పౌరుషాన్ని చూపుతామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరించారు. కాకతీయ కళాతోరణం అంటే సంపద, పాడిపంటలు, సంక్షే మానికి చిహ్నమని అన్నారు.  లోగోలో మార్పులపై హైకోర్ట్‌కు వెళ్తామన్నారు.

అధికారిక చిహ్నం మార్చడం సాధ్యం కాదని.. దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చార్మినార్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. చార్మినార్ ను లోగో నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ వద్ద నిరసనకు దిగారు.

హైదరాబాద్ కీ షాన్ అయిన పురాతన కట్టడం చార్మినార్ దశాబ్ధాల తరబడి ఈ మహానగరానికి ఐకాన్గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గురించి ఎవరైనా ఆలోచిస్తే వారి మదిలో మొదటగా మెదిలేది ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలు ఉన్న చార్మినార్ అని తెలిపారు. అలాంటి అద్భుత చరిత్ర ఉన్న చార్మినార్ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు.