హామీలపై చర్చకు కేసీఆర్​ సిద్ధమా..?

హామీలపై చర్చకు కేసీఆర్​ సిద్ధమా..?
  • టీఆర్​ఎస్​, బీఆర్​ఎస్​కు భయపడబోమని వెల్లడి
  • ప్రజలకు భయపడి బీఆర్​ఎస్​ అంటూ రాష్ట్రాన్ని విడిచివెళ్లేందుకు ప్లాన్​
  • జాతీయ నేతలు కేసీఆర్​కు మద్దతివ్వలేదని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు: జాతీయ పార్టీ అంటూ సీఎం కేసీఆర్​ కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్​ చుగ్​ మండిపడ్డారు. కొందరు నిద్రలో కలలు కంటే.. కేసీఆర్​ మాత్రం పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ కలలు ఎన్నటికీ నెరవేరవన్నారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. టీఆర్​ఎస్, బీఆర్​ఎస్​కు బీజేపీ భయపడదన్నారు. రాష్ట్ర ప్రజలకు భయపడే సీఎం కేసీఆర్​.. బీఆర్ఎస్​ అంటూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు. రాష్ట్రాన్ని కాపాడాల్సింది పోయి భ్రష్టు పట్టించారని ఫైర్​ అయ్యారు. ముందు సీఎంగా బాధ్యతలను నిర్వర్తించాలని, ఆ తర్వాత ప్రధాని అవ్వాలన్న కలలు కనాలని సూచించారు. మద్దతు కోసం కేజ్రీవాల్​, మమత బెనర్జీ, దేవె గౌడ, అఖిలేశ్​ యాదవ్ తదితరులను కలిసినా.. కేసీఆర్​కు ఎవరూ మద్దతివ్వలేదన్నారు. ఈ ఎనిమిదేండ్లలో ప్రజలకు కేసీఆర్​ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజల ముందుకు ఎలా వెళ్తారన్నారు. హామీలు నెరవేర్చకుండా మోసం చేసింది కేసీఆర్​ కాదా అని నిలదీశారు. ఉద్యోగాలివ్వలేదని, డబుల్​ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయలేదని, దళితబంధు ఇవ్వలేదని విమర్శించారు. ఆ హామీలపై చర్చకు తాము సిద్ధమని, కేసీఆర్​ సిద్ధమా అని సవాల్​ విసిరారు. రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని 
తరుణ్​ చుగ్​ స్పష్టం చేశారు. 

లక్షలాది మందితో భారీ సభ

వచ్చే నెల 2, 3వ తేదీల్లో హైదరాబాద్​లో నిర్వహించతలపెట్టిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా భారీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాలకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్​ షాలు వస్తుండడంతో సభకు కనీసం 10 లక్షల మందిని తీసుకురావడం మీద ఫోకస్​ పెట్టాలని పార్టీ నేతలకు తరుణ్​ చుగ్​ సూచించారు. మంగళవారం జరిగిన పార్టీ ఆఫీస్​ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభను పరేడ్​ గ్రౌండ్స్​లో పెట్టాలా? లేదా వేరే ప్రాంతంలో నిర్వహించాలా? అన్న విషయం మీదా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్​లోని వివిధ రాష్ట్రాల ప్రజలతో.. సమావేశానికి వచ్చే ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాల 
ఏర్పాట్లపై చర్చించేందుకు పార్టీ ఆఫీసులోని బోర్డు రూంను ప్రత్యేక ఆఫీసుగా ఏర్పాటుచేశారు. లక్ష్మణ్​ నేతృత్వంలో పనిచేసే ఆ ఆఫీసును చుగ్​ ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లక్ష్మణ్​ను ఆయన సన్మానించారు. సమావేశం కోసం ఏర్పాటు చేసిన 34 కమిటీలతోనూ తరుణ్​ చుగ్​ సమావేశమయ్యారు. 

వచ్చే నెల 1నే హైదరాబాద్​కు నడ్డా రాక

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం జులై ఒకటో తేదీనే హైదరాబాద్​కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర జాతీయ నేతలు మాత్రం ఈ నెల 28నే వస్తారు. వీళ్లంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. సమావేశాలు విజయవంతం అవ్వాలని ఈ నెల 28న రాష్ట్రమంతా ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా, సమావేశాల కోసం పార్టీనేతలే ఖర్చు పెట్టుకోవాలని తీర్మానించారు. ప్రతి ఆఫీస్​ బేరర్​ రూ.లక్ష, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్​చార్జులు రూ.50 వేలు, జిల్లా స్థాయి ఆఫీస్​ బేరర్లు రూ.20 వేలు, పార్టీ కార్యకర్తలు రూ.వెయ్యి చొప్పున పార్టీకి అందించాలని డిసైడ్​ చేశారు.