
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను నేషనల్ హైవేలతో లింక్ చేయాలని కోరారు. రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రోడ్డును నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేసి మహారాష్ట్రలోని చంద్రాపూర్, నాగ్‌పూర్ వరకు విస్తరించాలని కోరారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 30లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో నేషనల్ హైవేలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త హైవేలు ఇవ్వాలని పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరితే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపి, ఇంతవరకు అమలు చేయలేదని గుర్తుచేశారు.