రోడ్లు ఖరాబ్​: రాష్ట్రంలో అధ్వానంగా ఆర్​అండ్​బీ రాస్తాలు 

V6 Velugu Posted on Aug 04, 2021

  • వానలకు కొట్టుకుపోయిన రోడ్లు, కల్వర్టులు
  • కాంట్రాక్టర్లకు మూడేండ్లుగా రూ.వెయ్యి కోట్ల బకాయిలు
  • ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ చుట్టూ కాంట్రాక్టర్ల చక్కర్లు
  • బిల్లులు రాకపోవడంతో టెండర్లకు ముందుకొస్తలే
  •  

నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారాయి. మొన్న కురిసిన వర్షాలకు అనేక చోట్ల గుంతలు తేలాయి.  కల్వర్టులు కూలిపోయాయి. బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు నరకం చూస్తున్నారు. రాత్రివేళల్లో ప్రయాణం చేయాలంటే వణుకుతున్నారు. చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే.. రోడ్ల రిపేర్లకు ప్రభుత్వం పైసా రిలీజ్ చేయడం లేదు. మూడేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. 

మహబూబ్​నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్– తాండూర్ రోడ్డును పదేళ్ల కిందట నిర్మించారు. నాలుగేళ్లుగా ఈ రోడ్డును రిపేర్ చేయడం లేదు. దీంతో గండీడ్ మండలం అంచన్ పల్లి నుంచి జానంపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నది. పెద్ద గుంతలు పడి వాహనదారులకు నరకం కనిపిస్తోంది. ఈ దారిలో ప్రయాణమంటేనే జనం వణుకుతున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా నడపలేకపోతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా బజార్​హత్నూర్ మండలం కొల్హారి దగ్గర రోడ్డు దారుణంగా దెబ్బతిన్నది. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాక, రిపేర్లు జరగక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక పోలీసులే ప్రైవేటుగా ఓ జేసీబీ తెప్పించి గుంతలు పూడ్చారు.

ఫలితంగా ఈ మధ్య వరదల వల్ల దెబ్బతిన్న కొన్ని రోడ్లను రిపేర్ చేసేందుకు సర్కారు అనుమతులిచ్చినా.. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. టెంపరరీ పనులకు కూడా ఆర్​అండ్​బీ ఆఫీసర్ల వద్ద ఫండ్స్ లేకపోవడంతో రిపేర్లు చేయలేక చేతులెత్తేస్తున్నారు. రోడ్లు ఘోరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికుల అవస్థలు చూడలేక పోలీసులే స్వయంగా రిపేర్లు చేపడుతున్నారు.
బిల్లులు పెండింగ్
రాష్ట్రంలో ఆర్​అండ్​బీ రోడ్లను రిపేర్​ చేస్తున్న కాంట్రాక్టర్లకు సకాలంలో ఫండ్స్ రావట్లేదు. గత మూడేళ్లలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో సొంత డబ్బులు పెట్టి, అప్పులు చేసి పనులు కంప్లీట్ చేసిన కాంట్రాక్టర్లు.. ఫైనాన్స్ డిపార్ట్‌‌మెంట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయిన చోట.. పనులను వెంటనే చేపట్టాలంటూ ఆయా జిల్లాల నుంచి ఆర్అండ్ బీ ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్​కు పంపారు. ప్రయారిటీ ఉన్న కొన్ని వర్క్స్​ను గవర్నమెంట్ శాంక్షన్ ​చేసింది. కానీ ఈ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా స్పందన ఉండడం లేదు. పాత బకాయిలు చెల్లిస్తే తప్ప పనులు చేయబోమని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
ఈనెలంతా ఆగాలంట
రోడ్ల రిపేర్లపై ఇప్పుడే ప్రపోజల్స్ పంపవద్దని జిల్లాల్లోని ఎస్ఈలకు ఆర్​అండ్​బీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. రోడ్లు, కల్వర్టులు తెగిపోయిన చోట మాత్రమే ప్రయారిటీ కింద పనులు చేయాలని, అలాంటి వాటికే ప్రపోజల్స్ పంపాలని సూచించారు. ఆగస్టులో భారీ వర్షాలు పడే అవకాశముందని, అప్పుడు దెబ్బతిన్న రోడ్లతో కలుపుకొని అన్నింటికి ఒక్కసారే ప్రపోజల్స్ పంపితే సెప్టెంబర్​లో టెండర్లు పిలవొచ్చనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఆర్​అండ్​బీ పరిధిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, రిపేర్లపై ముందు నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. సర్కారు నుంచి సరిగ్గా ఫండ్స్ రాక అప్పులు తెచ్చి పెడుతున్న కాంట్రాక్టర్లు.. క్వాలిటీ పాటించడం లేదు. ఇలా రిపేర్ చేయగానే వానకు అలా కొట్టుకుపోతున్నాయి.
అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిధిలోని తలమడుగు, తా౦సి మండలాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటి నిర్మాణం కోసం రూ.కోటీ 90 లక్షలతో ప్రపోజల్స్ పంపారు. పాత పనుల బకాయిలు చెల్లించకపోవడంతో రిపేర్లు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల నుంచి గుడ్ల బొరి, పెంచికల్ పేట్ నుంచి కాగజ్​నగర్, ఆసిఫాబాద్ నుంచి ఉట్నూర్, కెరమెరి నుంచి నార్నూర్, దహెగాం మండలం కొంచవెల్లి నుంచి పీకలగుండం వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. కానీ ఫండ్స్ లేక రిపేర్లు చేయడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో నందిపేట, ఆర్మూర్ రూట్​లో జోర్పూర్ వాగు వద్ద కల్వర్ట్ కొట్టుకుపోవడంతోపాటు రోడ్డు దెబ్బతింది. ఖుద్వాన్​పూర్, తొండకూరు రోడ్​లో కల్వర్ట్, వెల్మల్, ఆర్మూర్ మధ్యలో కల్వర్ట్​తోపాటు 80 మీటర్ల రోడ్డు, నందిపేటలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి రిపేర్లకు మొత్తం రూ.50 లక్షలతో ప్రపోజల్స్ పంపినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఫండ్స్ మాత్రం మంజూరు కాలేదు.కామారెడ్డి జిల్లాలో కరీంనగర్–-కామారెడ్డి–-ఎల్లారెడ్డి (కేకేవై) స్టేట్ హైవే మీద చాలా చోట్ల గుంతలు పడ్డాయి. కామారెడ్డి టౌన్​లో సిరిసిల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతింది. మాచారెడ్డి నుంచి రాజంపేట, గుండారం మీదుగా మెదక్ జిల్లాకు వెళ్లే రోడ్డు మీద బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. నారాయణపేట జిల్లాలో రూ.12 కోట్లతో కొత్తగా నిర్మించిన ఊట్కూరు రోడ్డులో గుంతలు పడ్డాయి. ఊట్కూర్ నుంచి తిప్రాస్​పల్లి వరకు గుంతలను పూడ్చి రిపేర్లు చేసేందుకు ఏడాది కింద టెండర్ ప్రక్రియ పూర్తయినా.. పనులు ప్రారంభం కాలేదు.

కరీంనగర్ జిల్లా వీణవంక, మానకొండూర్ నడుమ 34 కిలోమీటర్ల రోడ్డు పనులను రూ.56 కోట్ల అంచనాతో 2014లో మొదలుపెట్టారు. ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. పెద్దపల్లి నుంచి ఎలిగేడు, జూలపల్లి మీదుగా సుల్తానాబాద్ రోడ్డు, పెద్దపల్లి బసంత్ నగర్, ధర్మారం ఎక్స్ రోడ్డు, మంథని, ముత్తారం మండలాల్లోని రోడ్లు, రామగుండం నుంచి పాలకుర్తి, అంతర్గాం మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లు ధ్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లాలోని కథలపూర్ మండలం కలికోట, సిరికొండల మధ్య రోడ్డుకు రూ.2.5 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఈ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టరుకు ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వలేదు. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వర్షాలకు రోడ్లు దెబ్బ తిన్నాయి. కాంట్రాక్టర్లకు  రూ.28.33 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో రిపేర్లు చేసేందుకు వాళ్లు ముందుకు రావడం లేదు. యాదాద్రి జిల్లాలో మూడేండ్ల కింద రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.50 కోట్ల దాకా బిల్లులు చెల్లించలేదు. దీంతో జిల్లాలో 17 రోడ్లకు రెండు, మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందనలేదు. ఆలేరు నియోజకవర్గంలోని యానాపూర్ తండా, జలాల్పూర్ రోడ్డుకు ఆరు సార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. రాయగిరి, మోత్కూరు మధ్య 10 కిలోమీటర్ల రోడ్డుకు రూ.9.70 కోట్లతో, మానాయికుంట తండా రోడ్డుకు ‌‌‌‌రూ.4.81 కోట్లతో ప్రపోజల్స్ పంపారు. తొర్రూరు, వలిగొండ వరకు రూ.2.32 కోట్లు పనులకు టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదు.
10 కోట్ల బిల్లులు రావాలె.. 
రూ.10 కోట్లతో పెద్దపల్లి, నిమ్మనపల్లె, నిట్టూరు, మద్దికుంట మధ్య రోడ్ల పనులు చేశాను. ఇందుకు పెద్ద మొత్తంలో అప్పు చేసి ఖర్చుపెట్టాను. రెండేండ్ల నుంచి బిల్స్ పెండింగ్​లో ఉన్నాయి. అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇలా చేస్తున్నారు కాబట్టే.. రోడ్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు.
                                                                                                                                                                                                                                                             - ప్రదీప్, కాంట్రాక్టర్, పెద్దపల్లి
 

Tagged Telangana, roads, damaged,

Latest Videos

Subscribe Now

More News