
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో… ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తన ప్రభావంతో ములుగు, జయశంకర్ భూపాల పల్లి, కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక నిన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ముసురు పడుతోంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం కురుస్తుంది. గ్రేటర్ పరిధిలో రెండు రోజులుగా వాన ముసురు పడుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. అటు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతుండటంతో GHMC సిబ్బంది అలర్ట్ అయ్యింది.
ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీమ్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. అటు కడెం ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి, ప్రాణహిత నదులు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలోకి భారీగా వరదనీరు వస్తుంది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తారు అధికారులు. జూరాలలో లక్ష 85 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో… లక్షా 82 వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు.