రాష్ట్ర అప్పు రూ.60వేల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు..

రాష్ట్ర అప్పు రూ.60వేల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు..

మంచిర్యాల  : శ్రీలంకలో రాజపక్సే వల్ల.. తెలంగాణలో సీఎం కేసీఆర్ వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో రూ.60 వేల కోట్లున్న అప్పు కాస్తా రూ.5 లక్షల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. రూ.30 వేల కోట్లతో  కాంట్రాక్టర్ జేబులు నింపడానికి, కమీషన్లు దోచుకోవడానికే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశారని మండిపడ్డారు. ‘‘ మునుగోడులో ఎలక్షన్లు వస్తున్నాయని మళ్లీ కేసీఆర్ కొత్తకొత్త వాగ్దానాలు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు ఇచ్చినంత ఈజీగా మునుగోడులో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈవిధంగా రాష్ట్రమంతటా కొత్త మండలాలు ఎందుకు ఇస్తలేరు?’’ అని సీఎం కేసీఆర్ ను వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తానని చెప్పి మిషన్ భగీరథ పథకంలో రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్.. ఒక్క ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణలో 16 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.