- నీట్ పేపర్ లీక్‌కు నిరసనగా ఆందోళన
ముషీరాబాద్, వెలుగు: నీట్ పరీక్ష నిర్వహించే ఏజెన్సీని రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. నీట్ పరీక్ష లీకేజీపై జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యానగర్ హిందూ మహా విద్యాలయ ఎదుట జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. సంతలో సరుకుల్లా ప్రశ్న పత్రాలను విక్రయిస్తే 22 లక్షల మంది విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా పరీక్ష నిర్వహించే ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని కోరారు. వైద్య విద్య పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కోరారు.
ఆందోళనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు పలికారు. అంతకుముందు విద్యార్థులను, శ్రీనివాస్‌గౌడ్, ఇతర లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. నందగోపాల్, సాయి, సతీష్, ప్రవీణ్, హరి, శంకర్, వినయ్, వినోద్ పాల్గొన్నారు.
