
ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ.. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ ను విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు ముట్టడించారు. తెలంగాణ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేందర్ కు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారుల ఆందోళన తీవ్రతరం కావడంతో వారిని అరెస్టు చేసి నారాయణ గూడ పోలీసు స్టేషన్కు తరలించారు. సంఘం అధ్యక్షుడు రాజేందర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారే తప్ప... ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు.
317 జీవో వల్ల భార్య ఒక దగ్గర భర్త మరో దగ్గర పని చేస్తూ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... వారి గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ఉద్యోగుల వయో పరిమితి 59 నుంచి 61 సంవత్సరాలకు పెంచి... నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి విడుదల చేయాలని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే.. ఉద్యోగులకు సంబంధించిన తదితర విషయలలో రాజేందర్... రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వత్తాసు పలకడంపై జేఏసీ నేతలు మండిపడ్డారు.