తాగునీటి కోసం .. తెలంగాణ సమ్మర్​ యాక్షన్​ ప్లాన్

తాగునీటి కోసం .. తెలంగాణ  సమ్మర్​ యాక్షన్​ ప్లాన్
  • ఏప్రిల్​ రెండో వారంలో రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్
  • కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్​లో సీఎస్​ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నందున తాగునీటికి ప్రస్తుతం ఇబ్బందులు లేవని సీఎస్​ శాంతి కుమారి తెలిపారు.  తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్​ శాంతి కుమారి మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే “సమ్మర్ యాక్షన్ ప్లాన్” ను రూపొందించి జిల్లాలకు నిధులను కూడా విడుదల చేసినట్లు  చెప్పారు. ఏప్రిల్ రెండవ వారం తర్వాత రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ను చేపడతామన్నారు. తాగునీటి సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు చేపట్టడం పూర్తి చేసినట్లు వివరించారు.  నిర్వహణ పరమైన లోపాలను ఎప్పటికప్పుడు సవరించి నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. 

వేసవి కాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్రధానంగా ఆపరేషన్, మెయింటెనెన్స్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్ లలో గతేడాది మాదిరిగానే నీటి మట్టాలున్నందున ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ , ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ మహా నగరంలో కూడా సరిపడా నీటిని సరఫరా చేస్తున్నామని, అయితే, కమర్షియల్ అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు తెలిపారు. మున్సిపల్​ అడ్మినిస్ర్టేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్మెంట్​ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.