15 శాతం మంది తహసీల్దార్లు సొంత జిల్లాల్లోనే తిష్ట

15 శాతం  మంది తహసీల్దార్లు సొంత జిల్లాల్లోనే తిష్ట
  • మల్టీ జోనల్ రూల్స్ కు విరుద్ధంగా పాలనను శాసిస్తున్నరు
  • పదేండ్లు దాటినా పక్క జిల్లాలకు వెళ్లేందుకు ససేమిరా
  • కలెక్టరేట్లు, ఆర్డీవో ఆఫీస్​లే కేరాఫ్ అడ్రస్
  • బదిలీల గండం నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొందరు తహసీల్దార్ల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వం మారుతున్నా, పాలసీలు మారుతున్నా తాము మాత్రం మారమని, తమ జిల్లాను వదిలి వెళ్లమని భీష్మించుకు కూర్చుంటున్నారు. వీరు సెకండ్ గ్రేడ్ గెజిటెడ్ ఆఫీసర్లు. నిబంధనల ప్రకారం.. ఈ పోస్టులు మల్టీ జోనల్ కాబట్టి సొంత జిల్లాలో ఉండకూడదు. కానీ, క్షేత్రస్థాయిలో సీన్ మాత్రం రివర్స్‌‌‌‌‌‌‌‌గా ఉంది.

15% మంది తహసీల్దార్లు తమ సొంత జిల్లాల్లోనే తిష్టవేసి, పాలనను శాసిస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట ఉంటున్న తహసీల్దార్ల బదిలీల వ్యవహారంలో జిల్లాల నుంచి అందిన అధికారిక నివేదికలు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్​లలోనే ఒకే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో 13 ఏండ్లకు పైగా పనిచేస్తూ కొందరు రికార్డు సృష్టించారు. 2012 నవంబర్ 9 నుంచి ఇప్పటివరకు ఆర్.మహేశ్(సూపరింటెండెంట్, కలెక్టరేట్), ఎల్.రమణ కుమార్ (తహసీల్దార్, డీఏవో, ఆర్డీవో ఆఫీస్) నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోనే తిష్టవేయగా, బి.ప్రశాంత్ కుమార్ మే 2013 నుంచి కలెక్టరేట్ పరిధిలోనే పరిపాలనను శాసిస్తున్నారు.

నిజామాబాద్​తోపాటు సంగారెడ్డి జిల్లాలో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది అధికారులు పదేండ్లకు పైబడి ఒకేచోట ఉన్నట్లు సమాచారం. రాజకీయ పలుకుబడితో అటాచ్గత ఎన్నికల సమయంలో ఈసీ నిబంధనల ప్రకారం.. సొంత జిల్లాలో ఉన్న వారంతా బదిలీ కావాల్సి ఉంది. కానీ, ఇక్కడే అసలైన తెలివితేటలు ప్రదర్శించారు.

ఫీల్డ్ లెవల్‌‌‌‌‌‌‌‌లో ఉంటే పక్క జిల్లాకు వెళ్లాల్సి వస్తుందని భావించిన కొందరు గెజిటెడ్ ఆఫీసర్లు రాజకీయ పలుకుబడితో కలెక్టరేట్లకు, ఆర్డీవో కార్యాలయాలకు అటాచ్ అయ్యారు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(ఏవో)గా, సూపరింటెండెంట్లుగా లూప్ లైన్ పోస్టుల్లో చేరి బదిలీ గండం నుంచి ఎస్కేప్ అయ్యారు. ఎన్నికలు ముగిసినా, ప్రభుత్వం మారినా మళ్లీ అక్కడే పాగా వేశారు. వీరి తీరుతో నిజాయితీగా పని చేసే ఇతర అధికారులకు అన్యాయం జరుగుతోందనే చర్చ నడుస్తోంది.

ఇక, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నివేదికలను పరిశీలిస్తే కథ మరింత ఆసక్తికరంగా ఉంది. వరంగల్ జిల్లాలో కె.విశ్వప్రసాద్ కలెక్టరేట్ ఏవో, డి.మంజుల, తిరునగిరి శ్రీకాంత్, కె.చంద్రశేఖర్, ముత్యాల శ్రీనివాస్, ఆర్.శ్రవణ్ కుమార్ కలెక్టరేట్లలో సూపరింటెండెంట్లుగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో జి.సుధాకర్ సెప్టెంబర్ 2020 నుంచి, వి.రఘుపతి ఫిబ్రవరి 2021 నుంచి లూప్ లైన్ పోస్టుల్లో పాగా వేశారు. 

తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తింపు

సొంత జిల్లాల్లో పాగా వేసిన తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి జిల్లాల నుంచి పంపిన వివరాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సీసీఎల్ఏ గుర్తించింది. చాలాచోట్ల అధికారుల అసలు సర్వీస్ వివరాలను, లూప్ లైన్ అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్లను దాచిపెట్టి ఆల్ క్లియర్ అన్నట్లుగా ముందస్తుగా నివేదికలు పంపడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి సేకరించిన తాజా ప్రొఫార్మా డేటాను పరిశీలించిన ప్రభుత్వం.. మరోసారి వివరాలు తెప్పించుకుంటున్నది.

ఈ క్రమంలోనే బదిలీల నిబంధనల నుంచి మినహాయింపు పొందేందుకు కొందరు అధికారులు అనారోగ్య కారణాలు, మెడికల్ లీవులు, స్పౌజ్ కేటగిరీలను అస్త్రాలుగా వాడుకుంటున్నట్లు తేలింది. తప్పుడు నివేదికలు సమర్పించి, ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన జిల్లా స్థాయి అధికారులపై, సమాచారాన్ని హైడ్ చేసిన తహసీల్దార్లపై వేటు వేసేందుకు సీసీఎల్ఏ సిద్ధమవుతోంది .