ఫార్చూన్ 500 కంపెనీలే టార్గెట్.. తెలంగాణకు భారీ పెట్టుబడుల ప్లాన్

ఫార్చూన్ 500 కంపెనీలే టార్గెట్.. తెలంగాణకు భారీ పెట్టుబడుల ప్లాన్
  • పెట్టుబడుల కోసం14 కీలక రంగాల ఎంపిక
  • ప్లగ్​ అండ్​ ప్లే విధానంలో సింగిల్​ విండో అనుమతులిచ్చేలా ఏర్పాట్లు
  • డిఫెన్స్, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌కు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్
  • సెమీ కండక్టర్ల నుంచి క్లీన్ ఎనర్జీ దాకా పక్కా రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్ 
  • గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ 

 

హైదరాబాద్, వెలుగు: ఫార్చూన్‌‌‌‌‌‌‌‌ 500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. రాష్ట్రానికి భారీగా గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేలా డిసెంబర్​ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్​ సమిట్‌‌‌‌‌‌‌‌కు సమగ్ర యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శరవేగంగా సిద్ధం చేస్తున్నది. కేవలం పెట్టుబడుల పరిమాణమే కాకుండా, వీలైనన్ని ఎక్కువ అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రంలో భాగస్వాములుగా చేర్చుకోవడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌లాంటి మొత్తం 14 ప్రాధాన్యత రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి రంగానికి ఒక స్పష్టమైన పాలసీ, నిర్దిష్ట ల్యాండ్ బ్యాంక్, గడువుతో కూడిన చట్టబద్ధమైన క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమలు చేసేందుకు కార్యాచరణను ఖరారు చేశారు. పరిశ్రమల స్థాపనలో ఏమాత్రం జాప్యం లేకుండా టీజీ-ఐపాస్ సింగిల్ విండో ద్వారా నిర్దిష్ట గడువులోగా అనుమతులు ఇచ్చే వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.

నైపుణ్యంతో కూడిన నిపుణుల లభ్యత, ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులు, ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్కులను వేదికగా చూపిస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత తయారీ, ఇన్నోవేషన్ కేంద్రంగా నిలబెట్టేలా ఈ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూపకల్పన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఈ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాన ఆకర్షణగా, అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలపాలని ప్రభుత్వం భావిస్తున్నది.  సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ నాలుగో నగరానికి సింగపూర్ ప్రఖ్యాత సంస్థ ‘సుర్బానా జురాంగ్’ మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తున్నది. ఇప్పటికే ఫ్యూచర్​ సిటీలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా.. కొన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టాయి.

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0

రక్షణ, ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణలో ఇప్పటికే ఏర్పాటైన పటిష్టమైన ఎకో సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.  ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0 ను విడుదల చేసేలా ప్లాన్​ చేశారు. 4 ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎక్సలెన్స్  పెట్టుబడిదారులకు ప్రామాణికం కానున్నాయి. 

ఇక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నిపుణులను తీర్చిదిద్దుతూ స్వదేశీ రక్షణ తయారీలో తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. దేశంలోనే తొలి స్పేస్ పాలసీని తీసుకొచ్చిన తెలంగాణ, ఇస్రో కీలక మిషన్లలో ఏకంగా 30 శాతం విడిభాగాలను ఉత్పత్తి చేసి అందిస్తోంది. విమానాల మరమ్మతులు, నిర్వహణ (ఎంఆర్వో) విభాగంలో సాఫ్రాన్ చేపట్టిన 189 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును వేగంగా గ్రౌండింగ్ చేస్తున్నారు. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ పైలట్ విజయవంతం కావడంతో డ్రోన్ ఇన్నోవేషన్, యూఏవీ తయారీ సంస్థలను రాష్ట్రానికి భారీగా రప్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25కు పైగా భారీ సంస్థలు, సప్లై చైన్‌‌‌‌లో 2వేలకు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, లక్ష మందికి పైగా నిపుణులు ఈ రంగంలో సేవలందిస్తున్నారు. లాక్‌‌‌‌హీడ్ మార్టిన్, బోయింగ్, ఎయిర్‌‌‌‌బస్, సాఫ్రాన్, బీడీఎల్, హెచ్‌‌‌‌ఏఎల్, స్కైరూట్, ధ్రువ స్పేస్‌‌లాంటి గ్లోబల్ సంస్థల విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది.  

సరికొత్త పెట్టుబడులకు ఆహ్వానం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర ఆర్థికాభివృద్ధి కోసం టెక్స్‌‌‌‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, టూరిజం రంగాల్లోకి సరికొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. 1,327 ఎకరాల కాకతీయ మెగా టెక్స్‌‌‌‌టైల్ పార్కులో కైటెక్స్, యంగ్‌‌‌‌వన్, వెల్‌‌‌‌స్పన్ సంస్థల రాకతో లక్ష ఉద్యోగాలు సృష్టించేందుకు భూ కేటాయింపులు వేగవంతం చేశారు. 4,172 ఎకరాల్లో విస్తరించిన 14 స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో కోకాకోలా, ఐటీసీ, అమూల్‌‌లాంటి బడా సంస్థల యూనిట్లను నెలకొల్పేందుకు మౌలిక వసతులు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 4,996 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 3 కంటైనర్ డిపోలు, మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులతో ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. 13.87 బిలియన్ డాలర్ల ఎగుమతులతో దేశంలోనే 8వ స్థానంలో నిలిచిన తెలంగాణ, లీడ్స్ 2025 నివేదికలో ‘హై-పెర్ఫార్మర్’ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ‘శక్తి’ ప్రోగ్రామ్, 286 ఐటీఐలు, 65 అడ్వాన్స్‌‌డ్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా యువతకు సర్టిఫైడ్ శిక్షణను అందిస్తున్నారు. చారిత్రక సంపదను కాపాడుతూనే రూ. 14 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల కొలువుల లక్ష్యంతో ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ 2025–-30ని అమల్లోకి తెచ్చింది. రాబోయే ఐదేండ్లలో 15 వేల హోటల్ గదుల నిర్మాణం, 27 పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధితో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

జీసీసీలు, ఐటీకి తిరుగులేని అడ్డాగా..

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), అత్యాధునిక ఐటీ టెక్నాలజీలకు హైదరాబాద్ నగరం తిరుగులేని అడ్డాగా నిలుస్తుండటంతో వీటిని రెట్టింపు చేసేలా సర్కారు వ్యూహం రచించింది. ఇప్పటికే నగరంలో 500కు పైగా జీసీసీలు, 3 లక్షల మంది ఉద్యోగులతో పాటు మొత్తం 9.39 లక్షల మంది ఐటీ శ్రామిక శక్తి కొనసాగుతున్నది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, గోల్డ్‌‌‌‌మన్ శాక్స్, మైక్రాన్, సర్వీస్‌‌‌‌నౌలాంటి సంస్థలు తమ కార్యకలాపాలను నగరంలో వేగంగా విస్తరిస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ చిప్ డిజైన్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులను ఆకర్షించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు.

దేశంలోనే అతిపెద్ద హార్డ్‌‌‌‌వేర్ ప్రోటోటైపింగ్ కేంద్రమైన టీ-వర్క్స్, టీ-హబ్, రిచ్‌‌లాంటి సంస్థల ద్వారా స్టార్టప్‌‌‌‌లకు మార్గదర్శనం చేస్తున్నారు. మరోవైపు డేటా సెంటర్ల రంగంలో 8 నుంచి 10 గిగావాట్ల సామర్థ్యమే లక్ష్యంగా చందన్‌‌‌‌వెల్లీ, భారత్ ఫ్యూచర్ సిటీల్లో వేల ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రాయదుర్గ్‌‌‌‌లో 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఇమేజ్ టవర్ ద్వారా ఏవీజీసీ, గేమింగ్ రంగంలో కొత్తగా 30 వేల మందికి ఉపాది దక్కనుంది.  

మరింత ముందుకు లైఫ్‌‌ సైన్సెస్‌‌

ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరొందిన తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సర్కారు భారీ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 2వేలకు పైగా కంపెనీలు, 40కి పైగా అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ జీసీసీలు, 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఔషధ పరిశోధనల నుంచి క్లినికల్ ట్రయల్స్, ఏపీఐలు, వ్యాక్సిన్లు, బయోలాజిక్స్ తయారీ దాకా సమగ్ర వాల్యూ చైన్ ఇక్కడ అందుబాటులో ఉంది. డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, అరబిందో, బయోలాజికల్-ఈతోపాటు నొవార్టిస్, రోచ్, సనోఫీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్‌‌లాంటి విదేశీ దిగ్గజాలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ ‘జీనోమ్ వ్యాలీ’, మెడికల్ డివైజెస్ పార్కులతోపాటు సుస్థిరమైన ‘గ్రీన్ ఫార్మా సిటీ’ని సర్కారు ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెస్తున్నది. సీసీఎంబీ, ఐఐసీటీ, నైపర్‌‌‌‌లాంటి పరిశోధనా కేంద్రాలు, 126 ఫార్మసీ కళాశాలలు పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను నిరంతరం అందిస్తున్నాయి. నియోవాంటేజ్, ఆర్‌‌‌‌ఎక్స్ ప్రొపెల్లంట్‌‌లాంటి ప్రైవేట్ భాగస్వాముల ద్వారా తక్షణమే అందుబాటులో ఉండే రెడీమేడ్ ల్యాబొరేటరీలను సిద్ధం చేశారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలోని అంతర్జాతీయ ఫార్మా కార్గో సదుపాయాలు తెలంగాణ ఔషధ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు వేగంగా చేరవేస్తున్నాయి. 
 
623 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్లస్టర్‌‌

సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, సరికొత్త ఈవీ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లోకి భారీగా పెట్టుబడులను రాబట్టేందుకు రోడ్‌‌‌‌మ్యాప్ సిద్ధమైంది. మహేశ్వరం, ఈ -సిటీ, దివిటిపల్లిలలో 1,291 ఎకరాల్లో ఈఎంసీలు ఉండగా, తాడిపర్తిలో మరో 623 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్లస్టర్‌‌‌‌ను ప్రతిపాదించారు. ఫాక్స్‌‌‌‌కాన్, మైక్రాన్, ఏఎండీ, క్వాల్‌‌‌‌కామ్ సంస్థల విస్తరణతోపాటు కాంపోనెంట్స్ తయారీలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు రాయితీలు ప్రకటించారు.

జహీరాబాద్ నిమ్జ్‌‌‌‌లో 12వేల ఎకరాల విస్తీర్ణంలో 5.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో భారీ ఆటో పరిశ్రమల స్థాపనకు చర్యలు వేగవంతం చేశా రు. హ్యుందాయ్ రూ. 8వేల కోట్ల ఇన్నోవేషన్ సెంటర్, అమరరాజా రూ. 9,500 కోట్ల లిథియం అయాన్ బ్యాటరీ గిగా కారిడార్ ప్రాజెక్టులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎన్కతల వద్ద 16 టెస్టింగ్ ట్రాక్‌‌‌‌ల తో కూడిన దేశంలోనే తొలి కనెక్టెడ్ అటానమస్ వెహికల్ (సీఏవీ) కేంద్రాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నది. పదేళ్ల ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’ ద్వారా 2030 నాటికి 19.9 గిగావాట్ల సోలార్, 54.7 గిగావాట్ల విండ్‌‌ ఎనర్జీని వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు భారీ మూలధన సబ్సిడీలను అందిస్తూ గ్రీన్‌‌ ఇండస్ట్రియల్‌‌ రెవల్యూషన్‌‌కు బాటలు వేస్తున్నారు.