ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ : తెలంగాణ టీచర్లకు విదేశీ టూర్లు

ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ : తెలంగాణ టీచర్లకు విదేశీ టూర్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ టీచర్లను విదేశాలకు పంపించి అక్కడి విద్య విధానాలను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఉత్తమ టీచర్లను ఏటా సత్కరిస్తామని, విదేశీ విద్యా విధానాల పరిశీలనకు ఇప్పటికే 25 మందిని ఫిన్లాండ్ పంపించామని, భవిష్యత్తులో వియత్నాం, జపాన్‌‌‌‌‌‌‌‌కూ పంపిస్తామని తెలిపారు.

పిల్లల్లో నైపుణ్యాలను గుర్తించి, బడులను బాగు చేసే టీచర్లను గుర్తించాలని, అలాంటి టీచర్లను ప్రభుత్వం తరఫున సన్మానం చేస్తామని వివరించారు. అలాంటి టీచర్లను ఎంపిక చేయాలని, భవిష్యత్తులో 500 మందిని విదేశాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.

 ఈ సందర్భంగా విద్యాశాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. దీంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, టీచర్లను సత్కరించారు. ఎస్సెస్సీ టాపర్లకు రూ. లక్ష చొప్పున నగదు బహుమతి అందజేశారు.టీచర్లకు 20 ఏండ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రమోషన్ల ను క్లియర్ చేశామని, పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న బదిలీలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

ఎలాంటి వివాదాలు లేకుండా 22 వేల మంది టీచర్ల ప్రమోషన్లను పూర్తి చేశామని, 36 వేల మంది బదిలీలు చేప్టటామని గుర్తుచేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన కేవలం 60 రోజుల్లోనే 11 వేల టీచర్ల నియామకాలు చేపట్టామని వివరించారు. టీచర్లకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. విద్యాశాఖలో చేపట్టిన కార్యక్రమాలకు నీతి అయోగ్ కూడా రాష్ట్రాన్ని అభినందించిందని గుర్తుచేశారు.  అలాగే, వంద శాతం ఫలితాలు సాధించిన బడులకూ నగదు ప్రోత్సాహకాలను అందజేసి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.