- పేపర్-2.. మ్యాథ్స్ వాళ్లకు ఓకే.. బయాలజీ వాళ్లకు చుక్కలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పేపర్-2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పరీక్ష జరగగా.. ప్రశ్నల సరళి మధ్యస్తంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. బయాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని.. మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రం పేపర్ పర్వాలేదనిపించిందని చెప్పారు.
శనివారం మార్నింగ్ సెషన్ 69 సెంటర్లలో పరీక్ష జరగగా.. 17,605 మందికి గాను 14,089 మంది (80.03%) హాజరయ్యారని టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్ 68 సెంటర్లలో 17,856 మందికి గాను 14,127 మంది (79.12%) ఎగ్జామ్ రాశారని వెల్లడించారు. ఆదివారం ఉదయం 85 సెంటర్లలో, మధ్యాహ్నం 91 సెంటర్లలో పరీక్షలు ఉంటాయని, 45,459 మంది అభ్యర్థులు అటెండ్ కానున్నారని తెలిపారు.
ఇన్ సర్వీస్ టీచర్ల ఓడీకి ప్రపోజల్స్
టెట్ పరీక్షలకు అటెండ్ అవుతున్న సర్కారు టీచర్లకు విద్యా శాఖ ఓడీ సౌకర్యం కల్పించనుంది. ఈ పరీక్షలకు అటెండ్ అయ్యే వారికి ఓడీ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
