టెట్ ఫలితాల్లో ఓసీలు డీలా!

టెట్ ఫలితాల్లో ఓసీలు డీలా!
  • జనరల్ కేటగిరీలో 31.14 శాతమే క్వాలిఫై 
  • ఫలితాల్లో ఎస్సీల హవా.. 69.68 శాతం పాస్ 

హైదరాబాద్, వెలుగు:   తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) ఫలితాల్లో ఈసారి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. జనరల్ కేటగిరీ(ఓసీ) అభ్యర్థులు వెనుకబడగా, రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులు సత్తా చాటారు. ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో అగ్రస్థానంలో నిలిచారు. మంగళవారం టెట్ ఫలితాలు రిలీజ్ చేసిన అధికారులు.. బుధవారం గణాంకాలను వెల్లడించారు. జనవరిలో జరిగిన టెట్ పరీక్షలకు అన్ని కేటగిరీలు కలిపి 1,95,181 మంది పరీక్ష రాయగా.. 1,00,270 (51.37%) మంది క్వాలిఫై అయ్యారు. టెట్ పరీక్షలో జనరల్ అభ్యర్థులకు కనీసం 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.

అయితే, టెట్ లో మొత్తం 24,346 మంది ఓసీలు పరీక్ష రాయగా, అందులో 7,582 (31.14%) మంది మాత్రమే అర్హత సాధించారు. బీసీలు 1,05,235 మందికిగాను 51,378(48.82%) మంది క్వాలిఫై అయ్యారు. ఎస్సీలు 37,022 మందికి 25,798 మంది, ఎస్టీలు 28,578 మందికి 15,512 మంది అర్హత సాధించారు. అయితే, నాన్- సర్వీస్ విభాగంలో ఓసీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

పేపర్-2 సోషల్ లో కేవలం 8.96 శాతం, మ్యాథ్స్ లో11.57 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్-1 మాత్రం కొంత మెరుగ్గా 44.87 శాతం మంది పాసయ్యారు.