
- దేశంలో వేగంగా పెళ్లిళ్ల పరిశ్రమ వృద్ధి
- సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
- వెడ్డింగ్ ప్లానర్లు రాష్ట్రాన్ని కొత్త దృష్టితో చూడాలని సూచన
హైదరాబాద్, వెలుగు: వివాహ వేడుకలకు ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణను నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రాన్ని వివాహ వేడుకలకు హబ్ గా మారుస్తామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్ లో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో ఆదివారం నాలుగో సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో పెళ్లిళ్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం మన దేశాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా చూస్తోందని, అలాంటి సమయంలో తెలంగాణను ప్రపంచపటంలో వివాహ వేడుకల హబ్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. వెడ్డింగ్ ప్లానర్లు తెలంగాణను కేవలం రాష్ట్రంగా కాకుండా కొత్త దృష్టితో చూడాలని సూచించారు. ‘‘రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో కాబోయే వధూవరులు పెళ్లి చేసుకుని మధుర స్మృతులను పదిలపరచుకోవాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గమ్యస్థానాల గురించి ప్రచారంలోకి తీసుకొచ్చి వివాహ వేడుకలను ఎందుకు తెలంగాణలో చేసుకోవాలో తెలిపేలా ప్రణాళికలు రూపొదింస్తాం. వెడ్డింగ్ డెస్టినేషన్ల పరిశ్రమకు పరిచయం చేసేందుకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేస్తాం. లైసెన్సులు, అనుమతులు, లాజిస్టిక్స్, వివాహాల నిర్వహణకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేస్తాం” అని జూపల్లి వివరించారు.
అలాగే ప్రైవేట్, -పబ్లిక్ భాగస్వామ్యంతో టూరిజం రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ‘మీరు ఆలోచించండి. మేము అమలు చేస్తాం’ అనే నినాదంతో పర్యాటక శాఖ ముందుకెళ్తున్నదన్నారు. తదుపరి ఎడిషన్‌కు ‘సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్’ పేరును ‘ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్’ గా మార్చాలని, దేశంలోని వివిధ సంస్కృతులను ఒకే వేదికపై పరిచయం చేయాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.