14 నుంచి ప్రజా విజయోత్సవాలు..డిసెంబర్ 9 దాకా ఏడాది పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు : భట్టి విక్రమార్క

14 నుంచి ప్రజా విజయోత్సవాలు..డిసెంబర్ 9 దాకా ఏడాది పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు : భట్టి విక్రమార్క
  • డిసెంబర్ 9 దాకా ఏడాది పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు : భట్టి 
  • పది నెలల్లో రాష్ట్రాన్నిఎంతో అభివృద్ధి చేశాం
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
  • కేబినెట్ సబ్ కమిటీ భేటీలోడిప్యూటీ సీఎం వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 11 నెలల పాలనలో విప్లవాత్మక, ఊహకు అందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విజన్ తెలియజేసేలా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

వీటి నిర్వహణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షత శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘నెహ్రూ పుట్టిన రోజున విజయోత్సవాలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. చివరి రోజైన డిసెంబర్ 9న హైదరాబాద్ సిటీలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, పటాకుల ప్రదర్శన ఉంటది.

26 రోజుల పాటు జరిగే ప్రజా విజయోత్సవాల్లో.. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా శక్తి వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలి. ఇప్పటికే 50వేల ఉద్యోగాలు ఇచ్చినం. దాదాపు రూ.18వేల కోట్లతో పంట రుణమాఫీ చేసినం. మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలిచ్చినం’’అని భట్టి తెలిపారు.

స్పోర్ట్స్ వర్సిటీకిశంకుస్థాపన చేస్తం

గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైనఅభ్యర్థులకు త్వరలో అపాయింట్​మెంట్ లెటర్లు అందజేస్తామని భట్టి తెలిపారు. ‘‘వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తం. స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన, 16 నర్సింగ్ కాలేజీలు,28 పారా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక ప్రోగ్రామ్​లు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఉంటది.

పక్కా ప్రణాళికలతో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలి’’అని సంబంధిత శాఖ కార్యదర్శులను భట్టి ఆదేశించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నారు.