ఫిబ్రవరి నుంచే ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఫిబ్రవరి నుంచే ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • కేసీఆర్​ నిర్వాకం వల్లే హామీల అమలు లేటు
  • రేపోమాపో కేటీఆర్, కవిత  జైలుకు పోతరు
  • జగదీశ్​రెడ్డి సహా తప్పు చేసినోళ్లందర్నీ జైలులో వేస్తం
  • మేమొచ్చి 47 రోజులే.. బీఆర్​ఎస్​ నేతలకు ఓపిక లేకుంటే ఎట్ల? 
  • కేటీఆర్, హరీశ్, సంతోష్​ మంచి డాక్టర్​కు చూపెట్టుకోవాలని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు: వచ్చే నెల నుంచే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్​ హామీలను అమలు చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీల్లో రెండు హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్​లో ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హామీల అమలుపై రివ్యూ చేశామని, వంద రోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేస్తామన్నారు. ఫ్రీ కరెంట్​ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అమలు చేసేవాళ్లమని, కానీ, ఖర్మ కొద్దీ విద్యుత్​ డిపార్ట్​మెంట్​లో ప్రభాకర్​ రావు అనే 82 ఏండ్ల ‘ముసలి యంగ్’ అధికారిని కేసీఆర్​ పెట్టుకున్న ఫలితంగానే అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. ఆయన వల్ల విద్యుత్​ డిపార్ట్​మెంట్​ రూ.70 వేల కోట్ల నష్టాలబారిన పడిందన్నారు. చత్తీస్​గఢ్​ కరెంట్​ను కొనుగోలు చేస్తూ యాదాద్రి, భద్రాద్రి పవర్​ ప్లాంట్ల నిర్మాణాన్ని నామినేషన్​ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చి నష్టాలకు కారణమయ్యారన్నారు. సీఎం రేవంత్​ మీటింగ్​కు పిలిచినా ప్రభాకర్​ రావు రాలేదని, తప్పు చేసినోళ్లు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని పోలీసులు జైలులో వేస్తారన్నారు. జగదీశ్​ రెడ్డిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. రేపోమాపో కేటీఆర్, కవిత జైలుకు పోతారని అన్నారు.  

వచ్చే టర్మ్​లో వంద గెలుస్తం

ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే పది సీట్లలో ఓడిపోయామని, మంచి పనులు చేసి వచ్చే టర్మ్​లో వంద సీట్లకుపైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  పార్లమెంట్ ఎన్నికల్లో 13 నుంచి 14 లోక్​సభ స్థానాలను గెలుచుకుంటామన్నారు. బీఆర్​ఎస్​ ఎక్కడా పోటీలోనే ఉండదన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చి 47 రోజులే అవుతున్నదని, ఇంత ఓపిక లేకుంటే ఎట్ల అని బీఆర్​ఎస్​ నేతలపై వెంకట్​రెడ్డి ఫైరయ్యారు. 120 నెలల పాటు బీఆర్​ఎస్​ సర్కారును ప్రజలు ఎట్లా భరించారో గుర్తు చేసుకోవాలని సూచించారు.

వంద కాదు.. 200 అడుగుల లోతులో పాతేస్తం

బీఆర్​ఎస్​ వాళ్ల దోపిడీకి వంద అడుగులు కాదు.. రెండు వందల అడుగుల లోతులో పాతేసినా పాపం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​ నేతల దోపిడీ వల్లే  మూడేండ్లు కాకముందే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయన్నారు. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు కట్టి 70 ఏండ్లు అవుతున్నా ప్రాజెక్టుకు ఒక్క చిన్న గీత కూడా పడలేదన్నారు. కేటీఆర్, హరీశ్, సంతోష్.. మెంటల్​హాస్పిటల్​లో చేరుతారన్న అనుమానం కలుగుతున్నదని, ఆలోపే మంచి డాక్టర్​కు చూపించుకోవాలన్నారు. ఎమ్మెల్యేలను కొనే దరిద్రపు అలవాటున్న బీఆర్​ఎస్ నేతలు.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరు నెలలు, ఏడాది మాత్రమే ఉంటుందంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తాము అలా చేయాలనుకుంటే ఆ పార్టీలో కేటీఆర్, హరీశ్ తప్ప ఇంకెవరూ మిగలరన్నారు. తమ పార్టీలో కోవర్టు ఆపరేషన్ ఏమీ లేదని, కేటీఆర్, హరీశ్ లే కడుపులో కత్తులు పెట్టుకుని పోట్లాడుకుంటున్నారన్నారు. రేవంత్​ నాయకత్వంలో తామంతా కలసికట్టుగా పనిచేస్తున్నామన్నారు.

రాష్ట్రం గుల్ల అయింది.. గాడిన పెడుతున్నం

కేసీఆర్​ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. దివాలా తీసిన విద్యుత్ శాఖను గాడిలో పెడుతున్నామన్నారు. అందుకే హామీల అమలులో కొంత ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి నుంచి డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల వరకు అన్ని హామీలను బీఆర్​ఎస్​ సర్కారు విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ లీడర్లలాగా తాము ప్రజలను రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్​ ఫామ్​హౌస్​దాటి ఉండేవారు కాదన్నారు. కాళేశ్వరంతోపాటు అన్ని అక్రమాలపైనా విచారణ జరుగుతున్నదని స్పష్టం చేశారు. కేసీఆర్​ ప్రభుత్వం ఊర్లల్ల ఒక్క డబుల్​ బెడ్రూమ్​ ఇల్లు కట్టలేదని, ఒక్క రేషన్​ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే ఏ మొహం పెట్టుకుని ప్రశ్నిస్తున్నారని కేటీఆర్​పై మండిపడ్డారు.