ఆహారం కల్తీ చేస్తే పీడీ యాక్ట్.. ప్రజల ఆరోగ్యంపై రాజీ పడబోం: మంత్రి దామోదర

ఆహారం కల్తీ చేస్తే పీడీ యాక్ట్..  ప్రజల ఆరోగ్యంపై రాజీ పడబోం: మంత్రి దామోదర
  • ఫుడ్ సేఫ్టీ కోసం ఈగల్ తరహా ప్రత్యేక వ్యవస్థ
  •     నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌‌నగర్‌‌లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్
  •     జల విహార్ వద్ద ఫుడ్ సేఫ్టీ వాకథాన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఆహార కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ‘ఈగల్’ తరహాలోనే, ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారని వెల్లడించారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాత ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చి, కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా  సోమవారం నుంచి ‘హెల్త్ వీక్’ ప్రారంభమైంది. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ఫోకస్ చేస్తూ ఆరోగ్యశాఖ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. 

ఉదయం నెక్లెస్‌‌ రోడ్డులోని జలవిహార్ నుంచి హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌ వరకూ సాగిన ఫుడ్ సేఫ్టీ అవేర్‌‌‌‌ నెస్ వాక్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. పట్టణీకరణ, బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రజలు బయట ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు పప్పు, ఉప్పు, నూనె, టీ పొడి వంటి ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.  

కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు... 

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌మెంట్‌‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌‌స్పెక్టర్లను నియమించామని చెప్పారు. రూ.15 కోట్లతో నిజామాబాద్, హన్మకొండ, మహబూబ్‌‌నగర్‌‌లలో మూడు కొత్త ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వాకథాన్ అనంతరం ఇందిరా పార్కులో 5 కిలోమీటర్లు వాకింగ్ చేశారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌లో జరిగిన 'ఈట్ రైట్ మేళా'ను సందర్శించిన మంత్రి దామోదర..మిల్లెట్స్ ఐస్ క్రీమ్, ఇప్ప పువ్వు లడ్డూలను రుచి చూశారు. ఇంట్లోనే కల్తీని ఎలా గుర్తించాలో తెలిపే స్టాళ్లను పరిశీలించి, ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు పాటిస్తున్న హోటళ్లు, స్ట్రీట్ వెండర్లకు 'హైజీన్ సర్టిఫికేట్లు' అందజేశారు. డబ్బు, ఉద్యోగం ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితానికి విలువ ఉండదని మంత్రి పేర్కొన్నారు.