- ములుగులో పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మారుమూల పల్లెలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం రూ.16,007 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (హ్యామ్ ) ద్వారా చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులను ఈ నెల 16న ములుగు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అక్కడే ప్రత్యేక పైలాన్‌ను ఆయన ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,300 కి.మీ రోడ్లను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి దశలో 96 నియోజకవర్గాల పరిధిలోని 2,162 రహదారులను (7,450 కి.మీ) ఆధునీకరించనున్నారు. గ్రామ పంచాయతీల నుంచి మండలాలు, జిల్లా కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్లను ఎంపిక చేశారు. నిర్మాణ పనులను 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాగా, హ్యామ్ విధానంలో నిర్మాణ వ్యయంలో 40 శాతాన్ని ప్రభుత్వం, 60 శాతాన్ని నిర్మాణ సంస్థలు సమకూరుస్తాయి.
ప్రభుత్వం తన వాటాను 15 ఏళ్లలో 30 వాయిదాల్లో చెల్లిస్తుంది. రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక 15 సంవత్సరాల పాటు వాటి నిర్వహణ బాధ్యతను సదరు నిర్మాణ సంస్థలే చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 17 ప్యాకేజీలకు గాను ఇప్పటికే 14 ప్యాకేజీలకు ఒప్పందాలు పూర్తయ్యాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదని, పల్లెల జీవితాలను మార్చే మార్గమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, రోగులకు మెరుగైన రవాణా దక్కాలనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ములుగు లాంటి అటవీ ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల వరకు రహదారులు విస్తరించి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు.
