వాట్సాప్‌‌‌‌ లోనే ప్రభుత్వ సేవలు! : సీఎస్‌‌‌‌ కే.రామకృష్ణారావు

వాట్సాప్‌‌‌‌ లోనే ప్రభుత్వ సేవలు! : సీఎస్‌‌‌‌ కే.రామకృష్ణారావు
  •     వెంటనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించండి
  •     అధికారులను ఆదేశించిన సీఎస్‌‌ రామకృష్ణా రావు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను జోడించాలని, వాట్సాప్‌‌‌‌ ద్వారా సులభంగా సేవలు అందేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని సీఎస్‌‌‌‌ కే.రామకృష్ణారావు ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) పనితీరును మెరుగుపరిచేందుకు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సెక్రటేరియెట్​లో గురువారం సీఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. 

ఇంధన, వైద్యారోగ్య, ఐటీ, పరిశ్రమలు, గనుల శాఖ, టీజీఐఐసీ, ఫ్యూచర్ సిటీ, ఇరిగేషన్, మున్సిపల్, మూసీ సుందరీకరణ, వాటర్ వర్క్స్ తదితర 13 శాఖల పనితీరుపై ఆయన విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, వేగం పెంచేందుకు టెక్నాలజీని వాడుకోవాలని, వివిధ శాఖల సమన్వయంతో ‘వాట్సాప్’ ఆధారిత సేవలను అందుబాటులోకి తేవాలని సీఎస్ ఆదేశించారు. 

మీ సేవ కేంద్రాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీలకు టీ-ఫైబర్ విస్తరణపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని పోటీగా నిలిపేందుకు, యువతకు ఉపాధి పెంచేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయాలన్నారు. స్టార్టప్ ఎకోసిస్టం, సైబర్ సెక్యూరిటీ, ఐటీ పెట్టుబడుల ఆకర్షణపై అధికారులతో చర్చించారు.

ఆస్పత్రుల పనులు పరుగులు పెట్టాలి

ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెరగాలని సీఎస్ ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌‌‌‌లోని టిమ్స్ (అల్వాల్, సనత్‌‌‌‌నగర్, ఎల్‌‌‌‌బీనగర్), న్యూ ఉస్మానియా, నిమ్స్ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కేవలం భవనాలే కాకుండా.. ఆయా కొత్త ఆస్పత్రుల అవసరాలకు తగ్గట్టుగా అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్‌‌‌‌లు, గదుల ఏర్పాటుపై ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

మందుల కొరత రాకుండా జాగ్రత్త పడాలన్నారు. మాతా-శిశు ఆరోగ్యం, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్యులు, నర్సుల నియామకాలు, ఉద్యోగుల ఈహెచ్‌‌‌‌ఎస్​ పథకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గనులు, ఫ్యూచర్ సిటీ, ఇతర శాఖలు

మైన్స్ శాఖలో ఇసుక సరఫరా పారదర్శకంగా ఉండేలా సాండ్ రీచ్‌‌‌‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ఇటీవల చేపట్టిన సంస్కరణలను అధికారులు సీఎస్‌‌‌‌కు వివరించారు. ప్రతిష్టాత్మక ‘భారత ఫ్యూచర్ సిటీ’, టీజీఐఐసీ పనుల పురోగతిని సీఎస్ సమీక్షించారు. ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ప్రాజెక్టులపైనా చర్చించారు. గత మూడు రోజులుగా సీఎస్ వరుసగా 13 శాఖలను సమీక్షించారు. రానున్న 2 రోజుల్లో మిగతా శాఖలపైనా సమీక్షలు నిర్వహించనున్నారు.