జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ టాప్.. పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధిక గ్రోత్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ టాప్.. పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధిక గ్రోత్
  • గత నెలలో రికార్డు స్థాయిలో 33 శాతం వృద్ధి నమోదు

న్యూఢిల్లీ, వెలుగు:  పోయిన నెలలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) వసూళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 33% గ్రోత్ నమోదైంది. దీంతో పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా గ్రోత్ సాధించిన స్టేట్ గా తెలంగాణ నిలిచింది. చిన్న రాష్ట్రాలు, యూటీల జాబితాలో లడఖ్ 81%, మణిపూర్ 47% వృద్ధిని సాధించాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ 32 శాతంతో మూడో ప్లేస్​లో నిలిచింది. దక్షిణాదిన తమిళనాడు 21 శాతం, కర్నాటక 20 శాతం, ఏపీ 17 శాతం, కేరళ 12 శాతం గ్రోత్​తో సరిపెట్టుకున్నాయి. సెప్టెంబర్​కి సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన జీఎస్టీ వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్​తో పోల్చితే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు రూ.1, 311 కోట్లు పెరిగినట్లు తెలిపింది. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్​లో రూ.3, 915 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా.. ఈ ఏడాది రూ.5, 226 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 10% గ్రోత్

గత నెలలో దేశంలో జీఎస్టీ వసూళ్లలో10% గ్రోత్ నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం రూ. 1,62,621 కోట్ల జీఎస్టీ కలెక్షన్ జరిగినట్లు తెలిపింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ. 29,818 కోట్లు, ఎస్జీఎస్టీ రూపంలో రూ. 37,567 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ. 83,623 కోట్లు, సెస్ రూపంలో మరో 11,613 కోట్లు వసూలు అయినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటివరకు నాలుగు సార్లు జీఎస్టీ వసూళ్లు రూ. 1.60 లక్షల కోట్ల మార్క్ ను దాటినట్లు వెల్లడించింది.