న్యూఢిల్లీ, వెలుగు: పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిచింది. దేశంలో లక్షకు పైగా ఫోన్లు రికవరీ చేసిన రాష్ట్రంగా ఉత్తమ పనితీరు కనబరిచింది.
కేంద్రం ప్రవేశపెట్టిన ‘సంచార్ సాథీ’ యాప్ సహకారంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి లక్షకుపైగా హ్యాండ్‌సెట్లు తిరిగి స్వాధీనం చేసుకుంది.తెలంగాణతో పాటు కర్నాటక కూడా లక్షకు పైగా ఫోన్ల రికవరీలో ముందు వరుసలో ఉన్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పోలీసులు, టెలికమ్యూనికేషన్ శాఖల మధ్య సమన్వయంతో దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు లక్షల హ్యాండ్‌సెట్ల రికవరీ మార్కును దాటినట్లు వివరించింది.
తర్వాతి స్థానంలో 80 వేలకు పైగా రికవరీలతో మహారాష్ట్ర ఉన్నట్లు తెలిపింది. ‘సంచార్ సాథీ’ యాప్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ లో మొత్తం 50వేలకుపైగా హ్యాండ్ సెట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.
