- నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జల్ సంచాయ్ - జన్ భాగీదారీ అవార్డుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ‘జల సంచాయ్– జన భాగీదారీ’ (జేఎస్జేబీ 1.0) అవార్డుల్లో సత్తాచాటింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో రాష్ట్రం మరో కీలక ఘనత సాధించింది.
జల్ సంచాయ్–జన్ భాగీదారీ (జన భాగస్వామ్యంతో జల సంరక్షణ) విభాగంలో దేశవ్యాప్తంగా తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకుని ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 5,20,362 పనులు పూర్తి చేయడంతో తెలంగాణకు ప్రథమ స్థానం లభించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వరుసగా రెండు, మూడు స్థానాలు సాధించాయి. కాగా, మంగళవారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనున్నది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డును పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన అందుకోనున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లాల తరఫున కలెక్టర్లు, డీఆర్డీఓలు అవార్డులు అందుకోనున్నారు. ఈ ఏడాది కేంద్రం 100 అవార్డులను రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్ సంస్థలు, ఎన్జీఓలు, అధికారులకు ప్రకటించింది. ఇందులో తెలంగాణ ప్రథమ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. డైరెక్టర్, కలెక్టర్లు, డీఆర్డీఓలతోపాటు ఇందులో భాగస్వాములైన అధికారులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ అగ్రస్థానంలో నిలపడంలో అధికారుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం పనుల జాతర, ఉపాధి పనుల్లోనూ నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.
