లైసెన్స్, రిజిస్ట్రేషన్, కరెక్షన్, పేరు మార్పు.. ఇలా వాహనాలకు సంబంధించి ఏది కావాలన్నా ఇది వరకు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఏజెంట్ల మాయాజాలంతో భారీగా చెల్లించుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే వెహికల్ కు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవచ్చు. వాహన్ పోర్టల్ ప్రారంభం కావడంతో వాహనదారులకు ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
సోమవారం (మార్చి 23) వాహన్ పోర్టల్ సేవలను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. దీంతో ఇక నుంచి జాతీయ వాహన్ పోర్టల్ లో తెలంగాణ రవాణా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాహన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, బదిలీ తదితర రవాణా శాఖ సేవలు సులభతరం కానున్నాయి.
కేంద్రం తీసుకొచ్చిన వాహన్ పోర్టల్ లో తెలంగాణ చేరడంతో.. రాష్ట్రవ్యాప్త వాహనాల సమాచారం జాతీయ డేటాబేస్‌లోకి వెళ్ళనుంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాలపై ఒత్తిడి తగ్గనుంది. అంతర్రాష్ట్ర వాహనాల బదిలీ సులభతరం కానుంది.
వాహన దారులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇవాళ్టితో (మార్చి 23) రెండో వాహనంపై 2 శాతం లైఫ్ టాక్స్ పన్ను రద్దు కానుంది. గతంలో కాలుష్యం నియంత్రణలో భాగంగా లైఫ్ టాక్స్ తీసుకొచ్చినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడంతో కొత్తగా వాహనాలు కొనేవారికి.. ఇది వరకు ఉన్న వాహనదారులకు కూడా ఉపశమనం లభించనుంది.
మొదటి దశలో కేవలం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆన్‌లైన్ చేయనున్నారు. దశలవారీగా మిగితా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త సాంకేతికతపై ఆర్టీఏ అధికారులు, సిబ్బంది, ఆటోమొబైల్ డీలర్లకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సాఫీగా సేవలు అందించేలా వారికి నైపుణ్యాన్ని పెంపొందించారు.
దేశంలోని ఏ ప్రాంతాలకైనా బదిలీ..
వాహన్ పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వాహనదారులు 52 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారానే పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్లతో పాటు అమ్మినా, కొన్న తర్వాత ఓనర్షిప్ బదిలీ ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. అలాగే, అంతర్రాష్ట్ర, జిల్లాలకు చెందిన వాహనాల బదిలీలకు సంబంధించి కూడా వాహనదారులు ఇక నుంచి ఎలాంటి ఎన్ఓసీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఆటోమేటిక్‌గా ఆన్లైన్లోనే బిదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. బండి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ సదుపాయం లభిస్తుంది. వాహనాలు చోరీకి గురైనా, రోడ్డు ప్రమాదాలు వంటివి జరిగినా కూడా ఆచూకీ కనిపెట్టేందుకు కూడా వాహన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
