టీయూకు కొత్త వీసీ ఎవరు..ఇన్​చార్జ్​గా ఎవరికీ బాధ్యతలు అప్పగించని సర్కార్

టీయూకు కొత్త వీసీ ఎవరు..ఇన్​చార్జ్​గా ఎవరికీ బాధ్యతలు అప్పగించని సర్కార్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసింది. వర్సిటీ వైస్​ చాన్స్​లర్​ రవీందర్ గుప్త లంచం తీసుకుంటూ నాలుగు రోజుల కింద ఏసీబీకి పట్టుబడి జైలుపాలయ్యారు. అయితే.. ఇప్పటివరకూ ఎవరికీ ఇన్​చార్జ్​ వీసీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించలేదు. వర్సిటీలో కొన్నాళ్లుగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను కూడా చక్కదిద్దేందుకు ప్రయత్నించడం లేదు. ఫలితంగా స్టూడెంట్లు, ప్రొఫెసర్లు ఆందోళనకు గురవుతున్నారు. 

ఏడాదిన్నరగా వివాదాలే

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి వైస్​ చాన్స్​లర్​గా రవీందర్ గుప్త​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ వర్సిటీ వార్తల్లో ఉంటున్నది. ఏడాదిన్నర నుంచి వీసీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.  అనేకసార్లు మంత్రులను, ఉన్నతాధికారులను స్టూడెంట్ యూనియన్​ లీడర్లు కలిసి.. విచారణ జరిపించాలని వినతిపత్రాలు ఇచ్చారు. వర్సిటీలో  నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయినా, సర్కారు పెద్దగా పట్టించుకోలేదు.

 చివరికి వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో కాలేజీ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు, వీసీ రవీందర్​ గుప్తకు మధ్య భేదాభిప్రాయాలు రావడం, వర్సిటీ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ (ఈసీ)లో పలుమార్లు గొడవలు జరగడంతో వివాదం మరింత ముదిరింది. దాదాపు రెండు, మూడు నెలలుగా వర్సిటీ ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ సభ్యులకు, వీసీకి మధ్య పడటం లేదు. ఇదే టైమ్​లో గత శనివారం పరీక్ష కేంద్రం కోసం ఓ ప్రైవేటు కాలేజీ మేనేజ్​మెంట్ నుంచి వీసీ రవీందర్​ గుప్త రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. 

ఇస్తే ఎవరికి ఇస్తరు?

ఏసీబీకి చిక్కి జైల్లో వీసీ రవీందర్​ గుప్త ఉండగా.. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. ఇన్​చార్జ్​గా కూడా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదు. ఒక వేళ బాధ్యతలు అప్పగిస్తే ఎవరికి అప్పగిస్తారనే   దానిపై హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ వర్గాల్లో పలువురి పేర్లు చర్చకు వస్తున్నాయి. ఇన్​చార్జ్​ వీసీగా  హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రిని కానీ, లేదా హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ వైస్ చైర్మన్ వెంకటరమణను కానీ నియమించే అవకాశం ఉందని ఆ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే ఇన్​చార్జ్​ వీసీని గానీ, పూర్తికాలపు వీసీని గానీ నియమించాలని వర్సిటీ స్టూడెంట్లు, ప్రొఫెసర్లు కోరుతున్నారు. వర్సిటీలోని పరిస్థితులను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని 
గుర్తుచేస్తున్నారు.