స్టూడెంట్ల సమస్యలపై ఆఫీసర్లతో మాట్లాడతా

స్టూడెంట్ల సమస్యలపై ఆఫీసర్లతో మాట్లాడతా
  • తమిళిసైని కలిసిన బాసర, ఓయూ, కేయూ సహా ​పలు వర్సిటీల స్టూడెంట్లు
  • తమ సమస్యలు పరిష్కారించేలా ఆదేశించాలని వినతి

హైదరాబాద్ :  యూనివర్సిటీల విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వారికి అండగా ఉంటానని గవర్నర్ ​తమిళిసై హామీ ఇచ్చారు. అన్ని వర్సిటీలను సందర్శించి, స్టూడెంట్ల సమస్యలపై ఉన్నత విద్యా మండలి ఆఫీసర్లతో మాట్లాడతానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ముందుగా ఉస్మానియా వర్సిటీ నుంచి స్టార్ట్ చేస్తానని ప్రకటించారు. యూనివర్సిటీ విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు అని గవర్నర్ పేర్కొన్నారు. బుధవారం రాజ్ భవన్ లో బాసర ట్రిపుల్​ఐటీ, కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ, మహత్మా గాంధీ, వరంగల్ ఎన్ఐటీ స్టూడెంట్లు, జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి హాస్టళ్లలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రాలు అందజేశారు. సుమారు గంటసేపు తమ సమస్యలను గవర్నర్ కు వివరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కనీస వసతులైన చదువు, ఆహారం, షెల్టర్, ఉద్యోగావకాశాలు, ట్రైనింగ్ వంటి సమస్యలను విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. తల్లిదండ్రుల కష్టం వల్లే వర్సిటీల్లో సీటు సంపాదించామని, తను కలిసిన వారిలో చాలా మంది రూరల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్పారు. కాగా విద్యార్థులకు గవర్నర్  జాతీయ జెండాలను అందజేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. 30 ఏళ్లలోపు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు.  అనంతరం బాసర ట్రిపుల్​ఐటీ, ఓయూ, కేయూ స్టూడెంట్లు మీడియాతో మాట్లాడారు.

స్టూడెంట్లు ప్రస్తావించిన సమస్యలు

బాసర ట్రిపుల్​ఐటీకి రెగ్యులర్ వీసీని నియమించాలి. 12 డిమాండ్లను పరిష్కరించాలి.
11 యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్ మెంట్ చేపట్టాలి.
పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి.
పీహెచ్ డీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఇస్తున్న రూ.25000 మూడేళ్లు ఇవ్వాలి.


ఆందోళన విరమించం   
క్యాంపస్​లో 8,500 మంది విద్యార్థులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. రెండు నెలలుగా సమస్యలు ఎదుర్కుంటున్నం . ఫుడ్ పాయిజన్ అయింది. ఇటీవల ఓ స్టూడెంట్ చనిపోయిండు. పలువురు విద్యార్థులకు హెల్త్ బాగాలేదు. మా సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. మాకు అండగా ఉంటానని గవర్నర్ హామీ ఇచ్చిన్రు. మా 11 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాడుతూనే ఉంటాం. - మాదేశ్, బాసర ట్రిపుల్ ​ఐటీ

విద్యా వ్యవస్థ నాశనం 
విద్యా వ్యవస్థను కేసీఆర్​ సర్కారు నాశనం చేసింది. ఏపీలో మూడు ట్రిపుల్ ​ఐటీలు ఎంతో అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ ఒక్క ట్రిపుల్​ఐటీలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులను ఎలుకలు కరుస్తున్నయి. స్టూడెంట్స్ ను రోడ్ల మీదకు తెచ్చారు. ఐదేళ్లుగా పీహెచ్ డీ నోటిఫికేషన్ లేదు. వర్సిటీల్లో 85 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ మా సమస్యలపై సానుకూలంగా స్పందించారు. - సురేశ్ యాదవ్, ఓయూ

రాష్ట్రం వచ్చాక అన్యాయం 
ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి మాకు రాష్ట్రం వచ్చాక తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇపుడు అన్ని యూనివర్సిటీల్లో ఉన్నాయి. నిరసన తెలిపే హక్కు కూడా లేదు. గతంలో రాజ్ భవన్ కు విద్యార్థులు వచ్చి వినతిపత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గంట సేపు అన్ని యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలను గవర్నర్ ఓపిగ్గా విన్నారు. పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. - తిరుపతి యాదవ్, కేయూ