పర్యాటకానికి పంచ వ్యూహాలు..ఏఐతో టూరిస్టుల పర్యటన ప్లానింగ్‌‌.. ‘మిడ్‌‌నైట్‌‌ మెట్రోపొలిస్’గా హైదరాబాద్‌‌

పర్యాటకానికి పంచ వ్యూహాలు..ఏఐతో టూరిస్టుల పర్యటన ప్లానింగ్‌‌.. ‘మిడ్‌‌నైట్‌‌ మెట్రోపొలిస్’గా హైదరాబాద్‌‌
  •     24 గంటలూ వ్యాపారాలు తెరిచే ఉండేలా ప్రణాళిక
  •     సింగిల్ కార్డుతో రాష్ట్రమంతా ప్రయాణించేలా ‘దక్కన్ ఎక్స్‌‌ప్లోరర్’ 
  •     ఇంటర్నేషనల్‌‌ మీటింగ్స్‌‌ కోసం వరంగల్, హనుమకొండలో భారీ కన్వెన్షన్ సెంటర్లు 
  •     హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు పిట్ ​స్టాప్స్​ 
  •     2047 నాటికి 40 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం 
  •     టూరిజం ‘విజన్ 2047’ నివేదికలో కీలక అంశాలు

హైదరాబాద్, వెలుగు:  గ్లోబల్ టూరిజంలో తెలంగాణ మెరిసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. టూరిస్టులు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను చూడటమే కాదు.. కొత్త అనుభూతిని పొందేలా  ‘విజన్ 2047’తో భారీ ప్లాన్​ రెడీ చేసింది. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో పర్యాటక రంగం కీలక భూమిక పోషించనున్నది. 

ఇందులో భాగంగా హైదరాబాద్‌‌ను ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడలా  ‘మిడ్‌‌నైట్ మెట్రోపొలిస్’ (అర్ధరాత్రి మహానగరం)గా తీర్చిదిద్దాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఏటా 6.15 కోట్ల మంది  టూరిస్టులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ సంఖ్యను 2047 నాటికి 40 కోట్లకు పెంచడమే లక్ష్యంగా టెక్నాలజీ, సేఫ్టీ, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌తో పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరిచేలా టూరిజం ‘విజన్ 2047’ను రూపొందించింది. 

ఏఐతో ‘పంచ’తంత్రం

ప్రతి పర్యాటకుడి అభిరుచికి తగ్గట్టుగా టూర్ ప్లాన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వినియోగించనున్నారు. ఇందుకోసం 5 రకాల వ్యూహాలు అనుసరించనున్నారు. పర్యాటకులు తమకు ఆసక్తి ఉన్న ప్రదేశాలు, సమయం  యాప్‌‌లో చెబితే చాలు.. ఏఐ వెంటనే వాతావరణం, రద్దీని విశ్లేషించి ఒక పర్ఫెక్ట్ టూర్ ప్లాన్‌‌ను రెడీ చేసి ఇచ్చేస్తుంది.  సాధారణంగా రాత్రి 11 దాటితే నగరంలో సందడి తగ్గుతుంది.

 కానీ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ‘నైట్ లైఫ్’ కీలకం . ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ కాన్సెప్ట్‌‌ను తెరపైకి తెచ్చింది. చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక నైట్ సర్క్యూట్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ చారిత్రక కట్టడాల వద్ద రాత్రిళ్లు కూడా సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు. రాత్రివేళ షాపింగ్, ఫుడ్ కోర్టులు, సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు 24 గంటలు పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్​ అందుబాటులో ఉండనున్నది. 

టూరిస్టుల భద్రత కోసం ప్రత్యేక లైటింగ్, పటిష్టమైన పోలిసింగ్​, మహిళలకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టనున్నారు.  లండన్ పాస్, సింగపూర్ టూరిస్ట్ పాస్ తరహాలో రాష్ట్ర  ప్రభుత్వం ‘దక్కన్ ఎక్స్ ప్లోరర్’ అనే ఆల్-ఇన్-వన్ స్మార్ట్ కార్డును తీసుకురాబోతున్నది. ఒక్క కార్డుతో రాష్ట్రంలోని ఏ పర్యాటక ప్రాంతానికైనా ఎంట్రీ టికెట్ తీసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. మ్యూజియంలు, పార్కులు సందర్శించవచ్చు. దీంతో పర్యాటకులకు సమయం ఆదా కానున్నది. 

సరికొత్త థీమ్స్

పెళ్లిళ్ల కోసం కేరళ, కులుమనాలి వెళ్లాల్సిన పనిలేకుండా రాష్ట్రంలోనే ‘వెడ్డింగ్‌‌ డెస్టినేషన్‌‌’ కేంద్రాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.  కాలుష్యానికి దూరంగా, పల్లె వాతావరణంలో గడపాలనుకునే వారి కోసం పల్లెలను టూరిస్ట్ స్పాట్‌‌లుగా మార్చనున్నారు. హైదరాబాద్ ఇప్పటికే మెడికల్ హబ్‌‌గా ఉంది. దీనికి తోడు అనంతగిరి కొండలు, ములుగు అడవుల్లో ప్రకృతి చికిత్సాలయాలు, యోగా రీట్రీట్ సెంటర్లు, స్పా రిసార్ట్‌‌లను ఏర్పాటు చేసి ‘వెల్‌‌నెస్ టూరిజం’ను  ప్రోత్సహించనున్నారు.  

నాగార్జునసాగర్, రామప్ప, కాళేశ్వరం ప్రాజెక్టుల అందాలను పైనుంచి చూసేలా ‘హెలి టూరిజం’ (హెలికాప్టర్ రైడ్స్) స్టార్ట్ చేయనున్నారు. నల్లమల, కవ్వాల్ అడవుల్లో పర్యావరణానికి హాని కలగకుండా  ఎకో కాటేజీలు, సోలార్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నారు.  టూరిస్టుల భద్రత కోసం, ముఖ్యంగా మహిళల కోసం సోలార్ కియోస్క్‌‌లు, పానిక్ బటన్లు, పర్యాటక ప్రాంతాల్లో షీ టీమ్స్ నిఘాను పెంచనున్నారు.  యాదాద్రి, వేములవాడ, బాసర, భద్రాచలం, అలంపూర్​, రామప్ప ఇలా ఆలయాలను  ప్రత్యేక సర్క్యూట్లు చేస్తున్నారు.  వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్‌‌‌‌ను హెరిటేజ్ సర్క్యూట్‌‌గా రూపుదిద్దనున్నారు.

 సిద్దిపేట, నల్లమల, శ్రీరాంసాగర్, జన్నారం, వికారాబాద్‌‌లలో  వెలెనెస్​ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పోచంపల్లి, నారాయణపేట, గద్వాలను హ్యాండీ క్రాఫ్ట్స్ సర్క్యూట్‌‌గా,  నాగార్జునసాగర్ (బుద్ధవనం), ఫణిగిరి, నేలకొండపల్లిని బుద్ధిస్ట్ సర్క్యూట్‌‌గా రెడీ చేస్తున్నారు.  వెడ్డింగ్‌‌ డెస్టినేషన్‌‌ కోసం చార్మినార్, భువనగిరి కోట, వరంగల్ కోటలను ముస్తాబు చేయనున్నారు.  పర్యావరణానికి హాని కలగకుండా (కార్బన్ న్యూట్రల్), స్థానికులకు ఉపాధి కల్పిస్తూ 2047 నాటికి తెలంగాణను ప్రపంచ పర్యాటక 
పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం ‘పంచ సూత్రాల’ వ్యూహాన్ని అమలు చేయనున్నది.

హైవేలపై పిట్​ స్టాప్స్​ 

 రోడ్డు ప్రయాణాన్ని ఆనందదాయకంగా మార్చేందుకు హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక పిట్‌‌స్టాప్ ఏర్పాటు చేయనున్నారు. హైవేలపై వెళ్లేటప్పుడు వాష్​రూమ్స్​, ఫుడ్ దొరక్క జనం ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. రాష్ట్రంలోని నేషనల్ హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ‘తెలంగాణ హైవే రిసార్ట్  అండ్​ పిట్‌‌స్టాప్’ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో లోకల్ ఫుడ్, రెస్ట్ రూమ్స్, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు, పిల్లల ప్లే ఏరియాలు నిర్మించనున్నారు. 

ఇక అంతర్జాతీయ సదస్సులకు వరంగల్​ వేదిక కాబోతున్నది. వరంగల్, హనుమకొండలో 10 వేల నుంచి 15 వేల మంది కూర్చొనే కెపాసిటీతో భారీ కన్వెన్షన్ సెంటర్లు నిర్మించనున్నారు. కేవలం హైదరాబాద్‌‌కే పరిమితం కాకుండా.. మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్స్‌‌లు, ఎగ్జిబిషన్స్ (మైస్)​ టూరిజాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నారు.  వరంగల్, హనుమకొండల్లో   భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్లను డెవలప్ చేయనున్నారు.